వాయుగుండంగా మారిన గులాబ్ తుఫాన్ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుంచి పశ్చిమ దిశగా గంటకు 8కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు తెలంగాణలోనూ ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం .. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసింది.

భారీ వర్షాల కారణంగా తెలంగాణ విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. వినియోగదారుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 1912 నంబర్ కు కాల్ చేయాలని సూచించింది. అలాగే కంట్రోల్ రూమ్ నెంబర్లు 7382072104, 7382072106, 7382071574 ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది. మూసీ నదీ పరివాహకప్రాంతాలు, చెరువులకు సమీపంలో ఉన్న కాలనీల్లో ప్రత్యేకంగా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై గవర్నర్ తమిళిసై సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఫోన్ చేసి పరిస్థితులపై ఆమె ఆరాతీశారు. తుఫాన్ కారణంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ను గవర్నర్ ఆదేశించారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందనీ.. ఈ సందర్భంగా గవర్నర్ కు సీఎస్ తెలిపారు.

ఇక ఏపీలో తుపాను కారణంగా గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ రాజ్ శాఖ చర్యలు చేపట్టింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు బ్లీచింగ్ పౌడర్, సోడియం క్లోరైడ్ సిద్ధం చేశారు. పూర్తిగా క్లోరినేషన్ చేసిన తర్వాతే తాగునీటి సరఫరా చేస్తున్నారు. 


మొత్తానికి గులాబ్ దెబ్బకు తెలుగు రాష్ట్రాల ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఈ వర్షం వల్ల ఎలాంటి నష్టం చేకూరుతుందోనని ఆవేదన చెందుతున్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి: