కార్తీ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన ఖాకీ సినిమా చూశారా.. ఆ సినిమాలో రాజస్థాన్‌లోని కొన్ని గ్రామాల్లో ఉన్న నేరగాళ్ల ముఠాల గురించి బాగా చూపించారు. దొంగల స్థావరాలుగా పేరున్న ఆ గ్రామాల్లోకి దొంగలను పట్టుకునేందుకు వెళ్తే.. అంతా మూకుమ్మడిగా దాడి చేసి పోలీసులనే ఉరికించి కొడతారు.. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతైంది. అయితే అది వాస్తవిక కథ ఆధారంగా తీసిన సినిమా. అయితే.. డబ్బు కోసం అంత కష్టం ఎందుకు అనుకున్నారో ఏమో.. ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని దేవగఢ్‌ జిల్లాలోని కొన్ని గ్రామాలు ఇప్పుడు సైబర్ నేరాల అడ్డాలుగా మారుతున్నాయి.


మామూలు దొంగ తనాలంటే.. చాలా కష్టపడాలి.. చీకట్లో సాహసాలు చేయాలి. ఒక్కోసారి దొరికిపోతే వళ్లు హూనం అవుతుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. కానీ సైబర్ నేరం అయితే.. అంత రిస్కే ఉండదు.. ఒక్క సిమ్‌ కార్డ్‌.. ఒక్క ఫోన్‌.. ఓ పది బ్యాంకు ఖాతాలు ఉంటే చాలు.. ఇప్పుడు దేవగఢ్‌ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే జరుగుతోందట. ఏకంగా ఊళ్లకు ఊళ్లే ఈ సైబర్‌ నేరాలు చేస్తూ బ్రహ్మాండంగా డబ్బు సంపాదిస్తున్నాయట. అంతేకాదు.. ఈ సైబర్ నేరగాళ్లు అక్కడ లోకల్‌ పొలిటికల్‌ పార్టీలో క్రియాశీలక కార్యకర్తలుగా కూడా పనిచేస్తున్నారట.


అంతే కాదు.. ఈ సైబర్ నేరగాళ్లకు అక్కడి లోకల్ పోలీసులు కూడా సహకరిస్తున్నారట. ఇతర రాష్ట్రాల వారు.. సెల్‌ ఫోన్‌ సిగ్నల్ ఆధారంగా నిందితులను పట్టుకుందామని వెళ్తే.. ఆలోపే వారికి సమాచారం అందుతోందట. అందుకే.. లోకల్‌ పోలీస్‌లకు సమాచారం ఇవ్వకండా వెళ్తేనే ఆ సైబర్ నేరగాళ్లు దొరుకుతున్నారట. పక్కనే ఉన్న పశ్చిమబెంగాల్‌ నుంచి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఒకేసారి 500 సిమ్‌ కార్డులు తెచ్చుకుంటారట. ఒక మోసం  పూర్తి కాగానే సిమ్‌ కార్డులు పారేస్తున్నారట.


ఒక్కో ముఠా వద్ద వందల కొద్దీ బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తాయట. ఎప్పటికప్పుడు ఖాతాల్లో నుంచి మరో ఖాతాలకు డబ్బు మార్చేస్తుంటాయట. ఇలా అనేక గ్రామాలు ఈ సైబర్ నేరాల్లో రాటు దేలిపోతున్నాయట. వీళ్ల కథతో ఓ సినిమా తీస్తే బంపర్ హిట్ ఖాయం అనుకుంటా.


మరింత సమాచారం తెలుసుకోండి: