తెలంగాణ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చేశారు.. తమ ఓపికకూ ఓ హద్దు ఉంటుందని చెప్పేశారు.. ఆ ఓపిక నశిస్తే ఇక పోరాటమే అని గట్టిగానే చెప్పేశారు. ఇంతకీ చెప్పింది.. ఎవరికి.. పోరాటం ఎవరి మీద అనుకుంటున్నారా.. ఇంకెవరి మీద.. కేంద్రం మీద.. కేంద్రం తెలంగాణకు అన్నివిధాలా అన్యాయం చేస్తోందంటున్న కేటీఆర్.. కష్టపడే రాష్ట్రాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందంటున్నారు. రాష్ట్రంలో కీలక కార్మిక వర్గంగా ఉన్నా చేనేతలను ఆదుకోవాలని ఎన్నోసార్లు కోరామని.. లేఖలు రాశామని అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని కేటీఆర్ అంటున్నారు.


టెక్స్‌టైల్‌ పార్కుకు నిధుల కోసం కేంద్రాన్ని పలుమార్లు కోరామన్న కేటీఆర్‌...రూ.897 కోట్లు మంజూరు చేసి.. చేనేత, మరమగ్గాల ఆధునీకరణకు సహకరించాలని కోరామన్నారు. మగ్గాల  ఆధునీకరణ కోసం రాష్ట్రం కూడా సగం నిధులు భరిస్తుందని.. రాష్ట్రానికి 13 చేనేత సమూహాలు మంజూరు చేయాలని కోరారు. సిరిసిల్లకు మెగాపవర్‌లూమ్‌ క్లస్టర్‌ మంజూరు చేయాలని..  కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కేటీఆర్‌ కోరుతున్నారు.


ఈ మేరకు కేటీఆర్ కేంద్రమంత్రులకు చేనేత, జౌళిశాఖ మంత్రులకు లేఖ రాశారు. నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్‌కు లేఖ రాసిన కేటీఆర్‌.. చేనేత, జౌళిశాఖలో చేపట్టిన కార్యక్రమాలకు నిధులివ్వాలని కోరారు. నేతన్నల సంక్షేమం దృష్ట్యా సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కుకు నిధులు కోరిన కేటీఆర్‌.. మౌలిక వసతుల అభివృద్ధికి రూ.897.92 కోట్లు ఇవ్వాలన్నారు.


కేంద్రం త్వరలోనే టెక్స్‌టైల్, అపరెల్ సెక్టార్ల అభివృద్ధి పాలసీ ఖరారు చేయాలని కోరిన కేటీఆర్.. పోచంపల్లిలో హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో నేషనల్ టెక్స్‌టైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ హ్యాండ్‌లూమ్‌ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరిన కేటీఆర్.. పెద్ద టెక్స్‌టైల్ పార్కులకు బ్యాంకు రుణాల్లో మినహాయింపులు ఇవ్వాలని కోరారు. కేంద్రం తెలంగాణకు తగినంతగా సాయం చేయడం లేదని..ప్రస్తుతం అడుగుతున్నామని.. స్పందించకపోతే.. సహనం నశిస్తే పోరాటం తప్పదని కేటీఆర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: