ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరిగాయి. భారీగా ఓటింగ్ జరిగింది. పల్లెల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తమ భవిష్యత్తును ఇచ్చే మంచి ప్రభుత్వం కోసం ఓటు వేశారు. అయితే భారీగా జరిగిన ఓటింగ్ ఎవరికి లాభిస్తుందో అర్ధం కాక విశ్లేషకులు సైతం అయోమయంలో ఉన్నారు. ఇదిలా ఉండగా వైసీపీ మద్దతుదారులు సైతం ఎన్నికలకు టీడీపీ పక్కా ప్లాన్‌తో దిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండే లక్షలాది ఓటర్లు సొంతూర్లకు వచ్చి ఓటు వేయడం వెనుక టీడీపీ ముందుచూపుతో వ్యవహరించిందని చెబుతున్నారు.

 వారంతా టీడీపీకి ఓటు వేశారా లేక వైసీపీకి ఓటు వేశారా అనేది జూన్ 4న తెలియనుంది. అయితే ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీడీపీ వ్యూహం ఆహా అనేలా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవైపున సంక్షేమ పథకాలతో జగన్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం, కరోనా సమయంలోనూ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేయడం వంటివి సైతం ఆయన చేపట్టారు. దీంతో ఆయనను ఎదుర్కొనేందుకు 6 నెలల ముందు నుంచే టీడీపీ వ్యూహాలను అమలు చేసిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

కరోనా సమయంలో ప్రజలు ఉపాధి లేక, అసలు బయటకు వస్తే చనిపోతామేమో అనే భయంతో ఇళ్లలోనే బిక్కుబిక్కుమని గడిపారు. ముఖ్యంగా పేదలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం మహిళలకు చేయూత, ఆటోడ్రైవర్లకు, టైలర్లకు, మత్స్యకారులకు, కాపులకు, బీసీలకు చాలా సాయం చేసింది. అయితే దీనిని తిప్పికొట్టి జగన్‌ను అధికారం నుంచి దింపాలంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే టీడీపీ గట్టి ప్లాన్ వేసింది. తమ పార్టీ అభిమానులు, తటస్థ ఓటర్లు మాత్రమే కాకుండా ఎక్కువ మంది ప్రజలను టీడీపీ నేతలు కలిశారు.


టీలు, టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేసి వారి మంచిచెడులు తెలుసుకున్నారు. ఇదే కాకుండా టీడీపీ సానుభూతిపరులు వేరే ప్రాంతాల్లో టీ షాపులు, ఇతర దుకాణాల వద్ద చర్చలు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడం, ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను ఎండగట్టడం వంటివి చేసినట్లు వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లతో మాట్లాడి, ఎన్నికలకు వారిని రప్పించారు. దీంతో భారీ ఓటింగ్ టీడీపీకి అనుకూలంగా జరిగిందనే ప్రచారం జరుగుతోంది. 6 నెలల ముందు నుంచే ఇలా ప్లాన్ చేసి, రాష్ట్రంలోని ఓటర్లను తమ వైపునకు తిప్పుకుంటూనే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను రప్పించడం టీడీపీకి లాభించనుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: