వారు ఓ ముఖ్య‌మంత్రికి వెన్నుపోటు పొడిచారు...అందుకోసం మ‌రో ముఖ్య‌మంత్రి వారికి అండ‌గా నిలుస్తున్నారు. ఇది..ఎక్క‌డో కాదు...మ‌న పొరుగున ఉన్న క‌ర్ణాట‌క రాష్ట్రంలో. దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తించిన క‌ర్ణాట‌క రాజ‌కీయాల గురించే ఇదంతా. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ స‌ర్కారులో భాగంగా సీఎం కుర్చీలో ఉన్న‌ కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు 15 మంది ఎమ్మెల్యేలు కారణమవడం...సీఎం పీఠాన్ని బీజేపీ చేజిక్కించుకోవ‌డం...అనంత‌రం వారిపై అన‌ర్హ‌త వేటు ప‌డ‌టం తెలిసిందే. బీజేపీకి సహకరించిన ఆ 15 మంది మాజీ ఎమ్మెల్యేలకు  మళ్లీ సీట్లు ఇచ్చే బాధ్యత తమది అని కర్ణాటక సీఎం యెడియూరప్ప ప్రకటించారు.


15 స్థానాల్లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా చెప్పారని.. అందుకు హామీ కూడా ఇచ్చారని యెడియూరప్ప తెలిపారు. బీజేపీ తరపున పోటీ చేసే వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. 2018 ఎన్నికల్లో ఆ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ నాయకులకు కార్పొరేషన్ పదవులు ఇస్తామని సీఎం పేర్కొన్నారు.  కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన ఉప ఎనికలు జరగనున్నాయి.


ఇదిలాఉండ‌గా, ముఖ్యమంత్రిగా నాలుగో ద‌ఫా యెడియూర‌ప్ప బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. 2007లో యెడ్డీ తొలిసారి సీఎం అయ్యారు. అప్పుడు ఆయ‌న కేవ‌లం ఏడు రోజులే సీఎం ప‌ద‌విలో కొన‌సాగారు. జేడీఎస్ పార్టీ త‌న మ‌ద్ద‌తును ఉప‌సంహ‌రించ‌డంతో యెడ్డీ సీఎం ప‌ద‌విని కోల్పోయారు. ఇక 2008 నుంచి 2011 వ‌ర‌కు మూడేళ్ల పాటు మ‌ళ్లీ యడ్యూరప్ప సీఎంగా చేశారు. అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో అప్పుడు రాజీనామా చేశారు. 2018 మేలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మూడు రోజుల‌కే త‌ప్పుకోవాల్సి వచ్చింది. అయితే మెజారిటీ నిరూపించ‌క‌పోవ‌డంతో ఆయ‌న రాజీనామా చేశారు.ఇటీవ‌లి ప‌రిణామాల్లో మ‌ళ్లీ సీఎం పీఠంపై కూర్చున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: