
మహా విష్ణువు గరుడ వాహనంపై, మూడు కోట్ల మంది (ముక్కోటి) దేవతల సమేతంగా భూలోకానికి దిగి వచ్చి దర్శనిమిస్తాడని అందువల్ల ఈ రోజును ముక్కోటి ఏకాదశి అని అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో లేచి తల స్నానాలు చేయాలి. భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలకు వెళ్లి ఉత్తర ద్వారం గుండా మహా విష్ణువును దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయని నమ్మకం. అలాగే ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా భగవంతుడి అనుగ్రహం సిద్ధిస్తుంది.
వైకుంఠ ఏకాదశి లో వైకుంఠ, ఏకాదశి అని రెండు పేర్లు ఉంటాయి. వైకుంఠం విష్ణువునూ , విష్ణువు ఉండే స్థానాన్ని సూచిస్తుంది. చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే స్త్రీ నుంచి అవతరించినందున విష్ణువు కు వైకుంఠః (వైకుంఠుడు) అనే పేరు వచ్చింది. విష్ణు పురాణం ప్రకారం.. ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా, వారికోసం మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వచ్చి విష్ణు స్వరూపాన్ని దర్శించుకున్న వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారట. అందువల్ల ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. సాధారణ రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసివేసి ఉంటాయి. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా దర్శనం కల్పిస్తారు.
విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి అని పద్మ పురాణంలో ఉంది. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి వెళ్తాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేస్తుంది. దీంతో అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని అనుగ్రహిస్తాడు. దీంతో ఈ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను తొలగించాలని ఆమె కోరగా.. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడని నమ్మకం.
ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయని భక్తులు విశ్వాసం. ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. ఏకాదశి రోజు విష్ణు, వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించు కోవాలి. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఏర్పాటు చేస్తారు.