ప్రస్తుతం భారత్ లో అంతా ఒకటే టాపిక్ నడుస్తోంది. గత రెండు వరాల నుండి టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్ 2020 లో భారత మహిళల హాకీ టీమ్ అద్వితీయమైన ప్రదర్శనతో సెమీఫైనల్ కు చేరుకుంది. దీనితో రాణీ రాంపాల్ నేత్రుత్వంలోని మహిళా హాకీ టీమ్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ నరమానవుడెవ్వరూ అనుకోని విధముగా సెమీఫైనల్ చేరుకున్న తీరు మాత్రం అభినందనీయం. మొదటి మూడు మ్యాచ్ లలోనూ ఓటమిని ఎదుర్కొని ఇంటి దారి పట్టడానికి సిద్దమైన టీమ్ ఏదో మాయ జరిగినట్టు సెమీఫైనల్ చేరడమంటే మాటలు కాదు. దీని వెనుక ఆ టీమ్ కృషి, మొక్కవోని దీక్ష, గెలిచి తీరాలన్న కసి వారిని ఇంత దూరం తీసుకొచ్చింది. ఇందులో భారత మహిళల హాకీ టీమ్ కెప్టెన్ రాణీ రాంపాల్ కృషి మరువలేనిది. మ్యాచ్ లో ఓడినా అందర్నీ ప్రోత్సహిస్తూ, వారికీ దైర్యం చెబుతూ సెమీఫైనల్ వరకు నడిపించిన తీరు అనిర్వచనీయం.
అయితే రాణీ రాంపాల్ ఒకప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొందో ఎవ్వరికీ తెలీదు. ఈమె హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లాలో షాహాబాద్ అనే ఊరిలో జన్మించింది. రాణి తండ్రి ఒక ఎద్దులబండి నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. తన తల్లి పని మనిషిగా కాలం వెళ్లదీస్తూ ఉండేది. వీరు ఒక రోజులో రెండు పూటలు అన్నం తిన్నారంటే ఆ రోజు పండగే అని చెప్పాలి. ఇంతటి నిరుపేద కుటుంబంలో పుట్టిన రాణీ రాంపాల్ కి ఏదోకటి సాధించాలని బలమైన కోరిక ఉండేది.  హాకీపై ఎంతో ఇష్టాన్ని ఏర్పరుచుకుంది. హాకీ నేర్చుకోవడానికి వాడి పడేసిన విరిగిపోయిన స్టిక్ తోనే సాధన చేసేది, కొత్త హాకీ స్టిక్ కొనడానికి తగిన డబ్బు ఉండేది కాదు. అలా హాకీ లో ఒక స్థాయికి వచ్చింది.

 కేవలం 15 సంవత్సరాల వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించింది. అప్పటికీ కూడా తనకు సొంత హాకీ కిట్ లేకపోవడం చాలా బాధాకరం. అప్పటి తన హాకీ కోచ్ ఆమెకు కొత్త హాకీ కిట్ ను కొనిచ్చాడు. ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోచ్ అందించిన సహాయ సహకారాల గురించి చాలా గొప్పగా వివరించిన సంగతి తెలిసిందే. అలా ఎన్నో బాధలు పడిన రాణీ రాంపాల్ ఇప్పుడు యావత్ భారతదేశం గర్వించేలా తన హాకీ టీమ్ ను ఒలింపిక్సె గేమ్స్ 2020 లో సెమీస్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. ఇదే ఊపును కొనసాగించి రాణీ రాంపాల్ సారథ్యంలో తొలి గోల్డ్ మెడల్ ను సాధించాలని కోరుకుందాం. జై భారత్...జై జై భారత్
   


మరింత సమాచారం తెలుసుకోండి: