
తిరుమల క్షేత్రానికి అడుగుపెట్టిన ప్రతి భక్తుడు తన నుదిటిపై తిరునామాన్ని ధరిస్తాడు. ఎందుకంటే ఇది భక్తి చిహ్నమే కాదు - దైవాన్ని తమతో పాటు ఉండేలా కోరుకునే విశ్వాస సంకేతం. తిరునామం ఉన్న భక్తుడిని చూసి స్వయంగా స్వామివారు తలచినట్టు అనిపిస్తుందని నమ్మకం. తిరునామధారణ కోసం టిటిడి ప్రత్యేక చర్యలు .. టీటీడీ (T.T.D) తిరునామ ధారణను ప్రతి భక్తుడికి అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో, రోజూ రెండు షిఫ్టుల్లో .. 130 మంది శ్రీవారి సేవకుల సేవలతో, క్షేత్రంలోని పలు ప్రదేశాల్లో తిరునామధారణను ఉచితంగా నిర్వహిస్తోంది. ఈ సేవకులు నామకోపు, ఎర్ర సింధూరం ఉపయోగించి తిరునామం దిద్దుతారు. దీనికి ఉపయోగించే రాగి కప్పు, మూడు నామాల ముద్ర మాండపేట నుంచి ప్రత్యేకంగా టిటిడి కొంటుంది. ఈ పదార్థాలు అన్ని భక్తుల విరాళాల ద్వారానే సేకరించబడుతున్నాయి.
తిరునామం తయారీకి వినియోగించే పవిత్ర పదార్థాలు : శ్రీవారి మూలవిరాట్ మూర్తికి వారానికి ఒకసారి శుక్రవారం పూజ అనంతరం తిరునామం ప్రత్యేకంగా దిద్దుతారు. ఇందుకోసం ఉపయోగించే పదార్థాలు: 16 తులాల పచ్చ కర్పూరం , 1.5 తులాల కస్తూరి, చందనం పొడి, మధ్యలో కర్పూర మిశ్రమం .. ఈ నామాన్ని “తిరుమణికాపు నామం” అని పిలుస్తారు. ఇది తమిళ అక్షరం ‘ప’ ఆకారంలో ఉంటూ 'యు'–'వై' మధ్యస్థంగా దర్శనమిస్తుంది.
వైష్ణవ సంప్రదాయంలోని తిరునామ రకాలు :
వడగలై తెగ – తిరునామాన్ని 'U' ఆకారంలో
తెంగలై తెగ – తిరునామాన్ని 'Y' ఆకారంలో
తిరుమణికాపు (తిరుమల) – తమిళ అక్షరం 'ப' (ప) ఆకారంలో, స్వామివారి నుదిటి పై ఉంటుంది ..
భక్తుల అభిప్రాయం ప్రకారం తిరునామాన్ని ధరిస్తే: చెడు శక్తుల ప్రభావం తగ్గుతుంది , మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, స్వామివారి దృష్టి, అనుగ్రహం లభిస్తుంది , స్వయంగా స్వామి తోడుగా ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది .. అని భావిస్తుంటారు .. అలాగే తిరునామం అనేది కేవలం మట్టి ముద్ర కాదు … అది భక్తి సంకేతం , దేవుని దృష్టికి లింక్ , మన హృదయాన్ని ఆయన చరణాలవైపు మళ్లించే పవిత్ర చిహ్నం. ప్రతి భక్తుడు తిరుమల క్షేత్రానికి అడుగుపెట్టినప్పుడు నుదిటి పై తిరునామంతో స్వామివారి ప్రేమను , అనురాగాన్ని ధరించాలి - అదే నిజమైన భక్తి మార్గం.