
- ఎన్టీఆర్ నుంచి జగన్ వరకు అందరూ బిసిలను మోసం చేసిన వారే
- బిసి రక్షణ చట్టం తెచ్చే ధైర్యం లేదా?
- కుల గణనను అడ్డుకునే కుట్రలు చేస్తే బిసిల తడాఖా ఏంటో చూపిస్తాం
- జగన్ కార్పోరేషన్లు ఏర్పాటు చేసి బిసిల్లో చీలిక తెచ్చే కుట్ర చేశారు
- బహుజన ఆత్మీయ సమ్మేళనంలో బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు
కుల గణనను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తే బిసిల తడాఖా ఏంటో చూపిస్తామని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అనంతపురంలో జరిగిన బహుజన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం కులగణనను చేస్తామని ప్రకటించినా... దాన్ని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయన్నారు. వాటన్నింటినీ బహుజనులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో జరిగిన బహుజన సమ్మేళనానికి రెండు రాష్ట్రాల్లోని బహుజన బంధువులు హాజరైనా కనీసం అనంతపురం జిల్లాలో ఉన్న బిసి ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు హాజరుకాకపోవడం దారుణమన్నారు. పార్టీల కబంధ హస్తాల్లో చిక్కుకొని వారి అనుమతులు లేకపోవడంతో కార్యక్రమానికి హాజరు కాలేని బానిసల్లా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసిల అభివ్రుద్ది, హక్కులు, వెనుకబాటు తనం, రిజర్వేషన్ల కోసం జరుగుతన్న ఉద్యమం ఈనాటిది కాదన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బిసిలకు రాజకీయంగా, ఆర్ధికంగా అభివ్రుద్ది చెందేందుకు ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ బిసిలు ఎందుకు అభివ్రుద్ది చెందడంలేదో విశ్లేషించుకోవాలన్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు బిసిలే వెన్నుముక, బిసిలకు రాజ్యాధికారం కావాలని మాట్లాడే పార్టీలు అధికారంలోకి వచ్చిక బిసిలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహించే ఓ సామాజిక వర్గం బిసిలను ఏ విధంగా అణగదొక్కిందో అందరికీ తెలుసన్నారు, ఏ పార్టీ అయినా అధికారంలోకి రాకముందు ఓ మాట... అధికారంలోకి వచ్చాక మరో మాట చెబుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీ ఆర్ పార్టీ పెట్టింది బిసిల కోసం కాదు... బిసి ఓట్ల కోసం
ఎన్టీ రామారావు టిడిపిని బిసిల కోసం స్ధాపించలేదని, బిసి ఓట్ల కోసం స్థాపించారని రామచంద్రయాదవ్ ఎద్దేవా చేశారు. 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం బిసిల అభివ్రుద్ది కోసం మురళీధరన్ కమిషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో బడుగుల పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ రిజర్వేషన్లు, సామాజిక అసమానతలు రూపు మాపడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేసి మురళీధరన్ కమిషన్ 1984లో నివేదిక సమర్పించిందన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ నివేదికను బయట పెట్టలేదన్నారు. నిజంగా ఆనాడు ఎన్టీ రామారామారావుకి బిసిలపై చిత్తశుద్ది ఉంటే మురళీధరన్ కమిషన్ నివేదికలో చెప్పినట్టు 44 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వారన్నారు. ఆ తరువాత ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేత్రుత్వంలోని టిడిపి ప్రభుత్వం కూడా మురళీధరన్ కమిషన్ నివేదికను పట్టించుకోలేదన్నారు. టిడిపి 22 ఏళ్లు అధికారంలో ఉంటే బిసిలకు ఏం చేసిందన్నారు ప్రశ్నించారు.
బిసిల్లో చీలిక తెచ్చేందుకే జగన్ కార్పోరేషన్ లు ఏర్పాటు చేశారు
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలు బిసిలను మోసం చేశాయని రామచంద్రయాదవ్ మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బిసిలను ఎంత వీలైతే అంత అణగదొక్కేందుకు ప్రయత్నించారన్నారు. బిసిల్లో చీలిక తెచ్చి వారి మధ్య విభేదాలు స్రుష్టించేలా కార్పోరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. తమ పార్టీలోని బిసిలను ఆ కార్పోరేషన్లకు ఛైర్మన్ లను చేసి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసి కార్పోరేషన్ ను వివిద కులాల కార్పోరేషన్లు విడగొట్టి బిసిల ఐక్యతను దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబూ... బిసి రక్షణ చట్టం ఏమైంది?
టిడిపి 2024 ఎన్నికల్లో బిసిలపై జరుగుతున్న దాడులు, హత్యలు, దుర్మార్గాల నుంచి రక్షణ కల్పించేందుకు బిసిల రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చిందని. ఇప్పటి వరకు ఆ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని రామచంద్రయాదవ్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నా బిసి రక్షణ చట్టానికి అతీగతీ లేదన్నారు. నిజంగా బిసిలపై చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే వెంటనే బిసి రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాక ముందు హామీలిచ్చి... అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కడం రివాజుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపిలో ఉన్న బిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు నాయకులు... బిసి రక్షణ చట్టంపై చంద్రబాబు నాయుడుపైన ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
జనాభా దామాషా ప్రకారమే స్ధానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలి
ఎన్నో ఏళ్లుగా కులగణనపై పోరాటం చేస్తుంటే ఇటీవల కేంద్రం ప్రకటన చేయడం స్వాగతించాల్సిన విషయం అని రామచంద్ర యాదవ్ అన్నారు. వాస్తవంగా అది బిసిల విజయంగా భావించాలని తెలిపారు. కేంద్రం కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా... దాన్ని అడ్డుకునేందుకు ఆయా రాష్ట్రాల్లో కుట్ర జరుగుతోందన్నారు. దానిపై బిసిలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. జనాభా దామాషా ప్రకారమే చట్టసభల్లో, స్థానిక సంస్ధల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ బిసిలను ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు తప్ప... బిసిల అభివ్రుద్దికి ఎవరూ పాటుపడటం లేదన్నారు. బిసిలకు మంచి చేసే వారెవరో ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. బిసివై పార్టీ బడుగులకు రాజ్యాధికారమే లక్ష్యంగా సామాజిక వర్గాల ఏకీకరణ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు.