జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రను రూపుదిద్దిన విప్లవాత్మక నేత, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన శిబు సోరెన్ ఇక లేరు. సోమవారం ఉదయం 8:48కి న్యూఢిల్లీ గంగారాం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన ఆయన మరణం దేశవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 81 ఏళ్ల వయస్సులో శిబు సోరెన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సవాళ్లతో కూడిన చికిత్స నడుస్తున్న తరుణంలో పరిస్థితి విషమించి, ఆయన జీవిత యాత్ర ముగిసింది. గంగారాం ఆసుపత్రిలో నెఫ్రోలజీ విభాగంలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు.


శిబు సోరెన్‌ మరణంపై ఆయన కుమారుడు, ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్రంగా స్పందించారు. ‘‘గౌరవనీయులైన దిశోం గురూజీ మనందరినీ విడిచిపోయారు. ఈ రోజు నేను శూన్యంలో ఉన్నాను,’’ అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఈ మాటలు శిబుసోరెన్‌ ఎలాంటి త్యాగపథాన్ని మిగిల్చారో తెలుపుతున్నాయి. జార్ఖండ్ కోసం జరిపిన ధీరపోరాటం .. శిబు సోరెన్ పేరు వినగానే జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర పోరాటం గుర్తొస్తుంది. అతివలిత ప్రాంతాల ప్రజల హక్కుల కోసం సాగిన ఉద్యమానికి ఆయనే ప్రాణం పోసారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ స్థాపించి, గిరిజనుల హక్కుల కోసం అనేక దశాబ్దాలపాటు పోరాడారు. అదే పోరాటం ఫలితంగా జార్ఖండ్ రాష్ట్రంగా అవతరించింది. ఆపై మూడు సార్లు సీఎం పదవిలో ఉండటంతో పాటు కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు.


కుల, వర్గ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజాకర్షక నాయకుడు .. శిబు సోరెన్ రాజకీయాలు వర్గ, కులపరంగా కాకుండా ప్రజాకేంద్రీకృతంగా సాగాయి. జాతీయ స్థాయిలో అజేయమైన గళంగా ఎదిగిన ఆయన .. గిరిజనుల గోడులు దేశం వింటే కారణం ఆయనే. దిశోం గురూజీ అనే పేరుతో అభిమానుల మదిలో నిలిచిపోయిన శిబుసోరెన్ మృతి... జార్ఖండ్ రాజకీయాల్లో శూన్యతను సృష్టించింది. శిబు సోరెన్ మానవ హక్కుల కోసం, గిరిజనుల సంక్షేమం కోసం, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసిన కృషి ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలిపేస్తుంది. రాజకీయానికి పునాది అనే విధంగా పోరాట పటిమను మిగిల్చిన శిబు సోరెన్ ఇక లేరు కానీ, ఆయన ఆశయాలు ఇంకా ఆ ప్రజల హృదయాల్లో జీవిస్తూనే ఉంటాయి !



మరింత సమాచారం తెలుసుకోండి: