యావత్ దేశాన్ని ప్రస్తుతం ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది. ఎటు చూసినా కరోనా విలయమే కనిపిస్తోంది. కరోనా ధాటికి లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారు. కరోనా పేషెంట్లకు చికిత్సను అందించడానికి ఆసుపత్రులు చాలట్లేదు. పడకలు సరిపోవట్లేదు. ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. ఈ పరిణామాల మధ్య తుఫాన్ రూపంలో మరో కొత్త చిక్కు వచ్చి పడబోతోంది.  భారత వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్తను వెల్లడించింది. మే 14 నాటికి అరేబియా సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం పెను తుఫాన్‌గా మారే అవకాశాలు లేకపోలేదు. ఇది క్రమంగా ఈ నెల 16 నాటికి బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. బలపడిన అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే ఛాన్స్‌ ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరించింది. ఈ తుఫాన్‌కు తౌక్టే అని పేరు పెట్టారు. ఇది భారత తీరాన్ని తాకితే ఈ ఏడాది దేశంలో ఇదే మొదటి తుఫాన్ అవుతుందన్నారు. దీని ప్రభావంతో కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తుఫాన్ ప్రభావంతో మాల్దీవులు, లక్షద్వీప్‌లలో గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: