నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ విషయంలో టీడీపీ మొదటినుంచీ ప్రభుత్వాన్ని తప్పుబడుతోంది. ఆయన అరెస్ట్ ని ఖండిస్తూ చంద్రబాబు, లోకేష్.. ఇతర నాయకులంతా మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రఘురామపై కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. తాజాగా రఘురామకృష్ణంరాజుకి ప్రాణహాని ఉందని ఏకంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు చంద్రబాబు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ ప్రాణాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బాబు ఈ లేఖలో గవర్నర్ ను కోరారు. తనకు ప్రాణహాని ఉందని ఎంపీ గతంలోనే చెప్పారని, దీనిని గుర్తించిన కేంద్రం ఆయనకు వై-కేటగిరి భద్రత కల్పించిందని లేఖలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యలపై గళం వినిపించినందుకే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు.

అయితే రఘురామ కృష్ణంరాజు విషయంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల్ని వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. వైసీపీ ఎంపీ అరెస్ట్ పై చంద్రబాబు ఇంత రాద్ధాంతం చేయడమేంటని ప్రశ్నిస్తోంది. ఇన్నాళ్లకు చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు బయటపడ్డాయని, రఘురామ కోర్టులో నోరు విప్పితే, చంద్రబాబు వ్యవహారం బయటపడుతుందని అంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు ప్రోద్బలంతో, టీడీపీ అనుకూల మీడియా సాయంతో.. రఘురామకృష్ణంరాజు ప్రభుత్వంపై విమర్శలు చేశారనేది వారి వాదన. రచ్చబండ కార్యక్రమంతో కావాలనే ప్రభుత్వంపై అభాండాలు వేశారని అంటున్నారు.

రఘురామకృష్ణంరాజు అరెస్ట్ తర్వాత చంద్రబాబు సహా ఏపీలోని ప్రతిపక్షాలన్నీ ఆ వ్యవహారాన్ని ఖండించాయి. అరెస్ట్ చేసిన తీరుని, ఆ తర్వాత సీఐడీ పోలీసుల విచారణ పర్వాన్ని కూడా తప్పుబట్టాయి. అయితే చంద్రబాబు ఇంకాస్త ఎక్కువగా స్పందించారు. రఘురామ అరెస్ట్ ని ఆయన తీవ్రంగా ఖండించారు, ఆయనకు ప్రాణహాని ఉందని ఏకంగా గవర్నర్ కు లేఖ రాశారు. దీంతో వైసీపీ నేతలు మరింతగా బాబుని టార్గెట్ చేశారు. ఇన్నాళ్లూ వారి మధ్య ఉన్న అపవిత్ర బంధం ఈ వ్యవహారంతో  బయటపడిందని ఎమ్మెల్యే అంబటి ధ్వజమెత్తారు. రఘురామ విషయంలో చంద్రబాబు అతిగా స్పందిస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ గవర్నర్ కి లేఖ రాయని బాబు, రఘురామ విషయంలో బయటపడ్డారని, సెల్ఫ్ గోల్ వేసుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు. బాబు వ్యవహారంతో ప్రజలకు నిజా నిజాలు తెలిసిపోయాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: