
బిగుతైన దుస్తులు ధరించడం వల్ల ముఖ్యంగా చర్మ సమస్యలు వస్తాయి. బిగుతైన జీన్స్, ప్యాంట్లు ధరించడం వల్ల గాలి సరిగ్గా చర్మానికి చేరదు. దీంతో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా చెమట పట్టడం, దురద, మంట, దద్దుర్లు వంటి చర్మ సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు చర్మంపై ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
బిగుతైన దుస్తులు ధరించడం జీర్ణవ్యవస్థపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా నడుము భాగంలో ఉండే టైట్ ప్యాంట్లు, బెల్టులు కడుపులోని అవయవాలపై ఒత్తిడి పెంచుతాయి. దీనివల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగదు. ఎసిడిటీ, ఛాతీలో మంట, అజీర్ణం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
బిగుతైన దుస్తులు ధరించడం వల్ల నరాల వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. టైట్ దుస్తులు కొన్ని చోట్ల రక్త ప్రసరణను అడ్డుకోవచ్చు. దీంతో కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపు, వాపు వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, కాళ్ళలో ఉండే నరాలపై ఒత్తిడి పెరిగి కండరాలు బలహీనపడతాయి. నడుము ప్యాంట్లు నడుము నరాల మీద ఒత్తిడి కలిగించి, వీపునొప్పికి కూడా కారణమవుతాయి.
మహిళలు మరీ బిగుతైన లోదుస్తులు ధరించడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పురుషులలో వృషణాలపై ఒత్తిడి, ఎక్కువ వేడి కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
టైట్ దుస్తులు ధరించడం వల్ల ఈ సమస్యలే కాకుండా, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, కండరాల నొప్పులు, శరీర భంగిమలో మార్పులు, కొన్నిసార్లు గర్భిణీ స్త్రీలకు కూడా ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి, ఫ్యాషన్‌ను అనుసరించే క్రమంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. బిగుతుగా ఉండే దుస్తులకు బదులు, వదులుగా, చర్మానికి గాలి తగిలేలా ఉండే దుస్తులు ధరించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రతిఒక్కరూ తమ సౌలభ్యం, ఆరోగ్యం గురించి ఆలోచించి దుస్తులు ఎంపిక చేసుకోవాలి.