రాజకీయం అయినా.. సినిమా అయినా.. వ్యాపారమైనా.. వారసత్వం అనేది చాలా ముఖ్యం. తమ వారసులు తమ లెజసీని కంటిన్యూ చేయాలని ఎవరైనా కోరుకుంటారు. సినిమాల్లో మరీ ముఖ్యంగా తమ వారసులు రాణించాలని ఎవరైనా అనుకుంటారు. సినిమాల్లో వచ్చే గుర్తింపు అలాంటిది మరి. అలా ఎంతోమంది హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో వారసులు రాణిస్తున్నారు. ఇప్పుడు మరో నట వారసుడు కూడా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నాడు.

 

 

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు శశికుమార్ తన తనయుడిని సినీ రంగంలోకి హీరోగా పరిచయం చేస్తున్నారు. 25 ఏళ్ల క్రితం వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా భాషా సినిమాలో ఆయన తమ్ముడిగా నటించిన వ్యక్తే శశికుమార్. తెలుగు, కన్నడ భాషల్లో నిర్మితమవుతున్న సినిమా ద్వారా తనయుడు అక్షిత్ శశికుమార్ ను పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకు సీతాయణం అనే పేరును ఖరారు చేశారు. ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకున్న అక్షిత్ శశికుమార్ సినిమాకు సన్నద్ధమయ్యాడని తెలుస్తోంది. ఓ ప్రేమ కథ ద్వారా అక్షిత్ సినిమాల్లోకి వస్తున్నాడు. నటనలో తీసుకున్న శిక్షణ ఈ సినిమాలో నటించేందుకు ఉపయోగపడిందని ఈ యువ నటుడు అక్షిత్ అంటున్నాడు.

 

 

కొత్త దర్శకుడు ప్రభాకర్ అరిపాక దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగులో అగ్ర దర్శకులైన వైవీఎస్ చౌదరి, దశరధ్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన ఈ కొత్త దర్శకుడు వినూత్నమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని సమాచారం. అక్షిత్  సరసన కొత్త భామ అనహిత భూషణ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెలుగు కన్నడ భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: