సినిమావాళ్లకు సెంటిమెంట్లు కాస్త బలంగా ఉంటాయి. సినిమాలు ఫ్లాపయితే దానికి కారణాలు విశ్లేషించే బదులు, సెంటిమెంట్లు బేరీజు వేసుకుంటారు. అందుకే హీరోయిన్లనుంచి, డైరెక్టర్లు, విడుదలయ్యే థియేటర్ల వరకు అన్నిటినీ లెక్కలో వేసుకుంటారు. తాజాగా పవన్ కల్యాణ్ కూడా కొత్త సినిమా విషయంలో అలాంటి సెంటిమెంట్ ఫాలో అయ్యారని తెలుస్తోంది. అయ్యప్పన్ కోషియమ్ అనే మలయాళ మూవీకి రీమేక్ గా పవన్ తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. దీన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. వాస్తవానికి పవన్ ఈ ప్రాజెక్ట్ ని హారిక హాసినికి చేయాల్సి ఉందట.

హారిక-హాసిని, సితార రెండు నిర్మాణ సంస్థలు ఒకే కుటుంబానికి చెందినవి. నిర్మాత ఎస్.రాధాకృష్ణ హారిక హాసిని వ్యవహారాలు చూస్తుంటే.. ఆయన కొడుకు నాగవంశీ సితార బాధ్యతలు చూస్తుంటారు. అయితే సితార ఇప్పటి వరకూ లో బడ్జెట్, మీడియం సినిమాలే చేసింది. పెద్ద ప్రాజెక్ట్ లు ఉంటే హారిక-హాసిని టేకప్ చేస్తుంది. పవన్-రానా ఇద్దరూ కలసి నటిస్తున్నారంటేనే అది భారీ బడ్జెట్ మూవీ అని అర్థమవుతోంది. అలాంటి సినిమాని సితారకు త్యాగం చేసింది హారిక-హాసిని.

హారిక హాసిని బ్యానర్లో పవన్ కల్యాణ్ చేసిన ‘అజ్ఞాతవాసి’ దారుణమైన ఫలితాన్నిచ్చింది. అందుకే పవన్ కానీ రాధాకృష్ణ కానీ మళ్లీ ఆ సంస్థలో సినిమా చేయడానికి ఇష్టపడలేదని అంటున్నారు. పవన్ తో సినిమా చేయాలి కాబట్టి, ‘సితార’కు ఈ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. లేదంటే హారిక-హాసిని బ్యానర్లో దర్శకుడు త్రివిక్రమ్ తప్ప వేరే దర్శకుడు సినిమాలు చేయడానికి వీల్లేదని నిర్మాత నియమం పెట్టుకున్నాడా అని కూడా సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

మొత్తమ్మీద పవన్ కల్యాణ్ సాగర్ చంద్ర అనే యువ దర్శకుడితో రిస్కీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అందుకే ఆ రిస్క్ కి ఫ్లాప్ సెంటిమెంట్ తోడు కాకూడదని హారిక-హాసిని బ్యానర్ ని పక్కనపెట్టారు. సితార సంస్థలో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం పర్యవేక్షణ ఉంటుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: