తెలుగు సినిమా చరిత్రలో 1990వ దశకంలో ఎంతో మంది హీరోయిన్లు వెండితెరను ఏలారు. అప్పట్లో రమ్యకృష్ణ - రంభ - రోజా - లైలా - రచన ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హీరోయిన్లు ఒక వెలుగు వెలిగారు. ఈ లిస్టులో కన్నడ కస్తూరి ఆమ‌ని కూడా ఉంటుంది. బెంగళూరులోని సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమ‌నికి తెలుగు మూలాలు ఉన్నాయి. ఆమె బంధువులు అందరూ హిందూపురం, అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. అందుకే ఆమెకు తెలుగు భాషతోనూ... తెలుగు ప్రజలతో అనుబంధం ఎక్కువ. చిన్నప్పటి నుంచే సినిమాలపై మోజుతో ఉన్న‌ ఆమని ఎలాగైనా తెర‌పై క‌న‌ప‌డాల‌ని.. అది కూడా హీరోయిన్‌గానే అని క‌ల‌లు క‌నేవార‌ట‌.

ఈ క్ర‌మంలోనే సినిమాల్లో అవ‌కాశాల కోస‌మే బెంగళూరు నుంచి చెన్నైకు చెక్కేసింది. ముందుగా ఇళయరాజా సోదరుడు దర్శకత్వంలో ఒక తమిళ సినిమాలో నటించిన ఆమని తెలుగులో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన జంబలకిడిపంబ సినిమాతో ఇక్కడ ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఆమెను కెరీర్‌ను ట‌ర్న్ చేసిన ద‌ర్శ‌కుడు మాత్రం ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయ‌న దర్శకత్వంలో జగపతి బాబు హీరోగా వచ్చిన శుభలగ్నం సినిమా తో ఆమని ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఓ మధ్య తరగతి వ్యక్తి భార్యగా ఎన్నో ఆశలు ఉన్న ఆమ‌ని చివరకు తన భర్తను రోజాకు అమ్ముకునేందుకు సిద్ధపడుతుంది.

చివరకు డబ్బు కన్నా తన భర్త త‌న‌కు ముఖ్యం అని తెలుసుకుని.. భర్తకు దగ్గరవడం తో కథ సుఖాంతమవుతుంది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఇన్నేళ్లకు కూడా ఆమ‌ని ఎక్కడ కనిపించినా చాలామంది అమ్మో ఈమె భర్తను అమ్ముకుంటుంద‌ని సరదాగా ఆటపట్టిస్తూ ఉంటారట. ఫంక్షన్ల‌కు వెళ్ళినప్పుడు పక్కనే ఉన్న మహిళలు ఏం అమ్మాయి అంత ఈజీగా భ‌ర్త‌ను ఎలా అమ్మేశావ్ అని అనేవారట. తన జీవితంలో ఇదో మరిచిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: