ఓ ప్రముఖ వ్యక్తి మన ఇంటికి వస్తే సంబరపడిపోతాం. అదే ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి వస్తే ఇక మన ఆనందానికి హద్దులుండవు. ప్రస్తుతం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరక్టర్ హరీశ్ శంకర్ అదే తన్మయత్వంలో ఉన్నాడు. అవును.. తన దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న వాల్మీకి సెట్స్ కి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సినిమాటోగ్రాఫర్, మూడు సార్లు ఆస్కార్ గ్రహీత, హాలీవుడ్ కి చెందిన రాబర్ట్ రిచర్డ్ సన్ రావడమే హరీశ్ శంకర్ ఆనందానికి కారణం.


 

ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్న హరీశ్ శంకర్.. “మూడు సార్లు ఆస్కార్ అవార్డు అందుకున్న వ్యక్తి నా సినిమాకు కెమెరా హ్యాండిల్ చేయటమంటే ఇంతకుమించిన అదృష్టమేముంటుంది. మా సినిమా సెట్స్ కి ఆయన రావడమే దేవుడు వచ్చినట్టుంది. ఆయన కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తూండగా నేను యాక్షన్ చెప్పడం జీవితాంతం మర్చిపోలేని అనుభూతి. ఆయన ఆశీర్వాదాల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను” అంటూ తన భావోద్వేగ క్షణాలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. హైదరాబాద్ సందర్శనలో ఉన్న రాబర్ట్ రిచర్డ్ సన్ తనకు సమీపంలో చిత్రం షూటింగ్ లొకేషన్ కు వెళ్లారు. ఇటువంటి సందర్భాలు ఎవరికైనా ప్రత్యేకమే. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న వాల్మీకి తమిళ్ లో వచ్చిన జిగర్తాండ సినిమాకు రీమేక్.


 

జేఎఫ్ కే, హ్యూగో, ఏవియేటర్ సినిమాలు రాబర్ట్ కెమెరా పనితనానికి ఆస్కార్ తెచ్చిపెట్టిన చిత్రాలు. మరో ఆరు సినిమాలు ఆస్కార్ నామినేషన్ కు ఎంపికయ్యాయి. రాబర్డ్ మొదటి భార్య వారణాసి వాసి. ఆయన కూతురు కూడా ఇక్కడే జన్మించింది. కొన్నేళ్ల క్రితం రాబర్ట్ తన కెమెరాతో ఓల్డ్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొఘల్ కోటలను ఓ అంతర్జాతీయ చారిటీ కోసం చిత్రీకరించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: