ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు సరిగ్గా పనిచేయని నాయకులని పక్కనబెట్టి కొత్త నేతలకు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఈ క్రమంలోనే నెల్లిమర్ల నియోజకవర్గంలో కూడా చంద్రబాబు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొదట నుంచి నెల్లిమర్ల టీడీపీకి కంచుకోటే. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఉన్న భోగాపురంలో వరుసపెట్టి ఆరు సార్లు టీడీపీ గెలిచింది...1983 నుంచి 2004 వరకు వరుసగా టీడీపీ తరుపున పతివాడ నారాయణస్వామి విజయం సాధించారు.

ఇక భోగాపురం నుంచి నెల్లిమర్ల మారక టీడీపీకి షాక్ తగిలింది. 2009లో ఓడిపోగా, 2014లో మళ్ళీ గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే ఇప్పుడు అక్కడ టీడీపీ బాధ్యతలు చూసుకునే విషయంలో క్లారిటీ లేదు. నారాయణస్వామికి వయసు మీద పడింది..ఇప్పటికే ఆయనకు 80 ఏళ్ళు దాటేశాయి. దీంతో ఆయన యాక్టివ్‌గా పనిచేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, ఆయన్ని తప్పించి కొత్త నాయకుడుకు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇంచార్జ్ పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు..ఇంచార్జ్ పదవి ఆశిస్తున్నారు. గత రెండేళ్లుగా ఆయన నెల్లిమర్లలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. సొంత డబ్బులు సైతం ఖర్చు పెడుతూ..ప్రజలకు అండగా ఉంటున్నారు. అలాగే స్థానిక ఎన్నికల్లో నెల్లిమర్లలో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి టీడీపీకి మంచి విజయాలు అందించారు.

అందుకే ఇంచార్జ్ బాధ్యతలు ఇస్తే...నెక్స్ట్ ఎన్నికల్లో నెల్లిమర్లలో టీడీపీ జెండా ఎగరవేస్తానని అంటున్నారు. అటు కిమిడి కళా వెంకట్రావు బంధువు కర్రి చంద్రశేఖర్ కూడా పార్టీ ఇంచార్జ్ పదవి కోసం ఆరాటపడుతున్నారు. రెండుసార్లు ఎంపీపీగా పనిచేసిన చంద్రశేఖర్‌కు కూడా నియోజకవర్గంపై పట్టు ఉంది. ఇదే సమయంలో నారాయణస్వామి నాయుడు మనవడు తారక రామారావుకు నెల్లిమర్ల సీటు ఇవ్వాలని డిమాండ్ వస్తుంది. మరి చివరికి నెల్లిమర్ల పగ్గాలు ఎవరికి దక్కుతాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: