తెలంగాణ ప్ర‌జ‌ల్లో మ‌రో టెన్ష‌న్ మొద‌లైంది. ఇప్ప‌టికే, క‌రోనా కేసుల విస్తృతితో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లో ఉండ‌గా... తాజాగా ఇంకో స‌మ‌స్య వారిని బెంబేలు ఎత్తిస్తోంది. అదే మిడ‌త‌ల దండు. దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తున్న ఈ ప్రాణులు తెలంగాణ‌లో ఇప్ప‌టికే ఓ ద‌ఫా త‌మ ఎంట్రీ ఇచ్చాయి. తాజాగా మ‌ళ్లీ వాటి ఆందోళ‌న తెర‌కెక్కింది. ఆదిలాబాద్ జిల్లాకు జూన్ 20 నుంచి జూలై 7 వరకు మిడతల దండు వచ్చే ప్రమాదముందని నిపుణులు సూచించారు. దీంతో, సంబంధిత అధికారులు అల‌ర్ట్ అయ్యారు. జిల్లాలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో మిడుతల దండును ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ దేవసేన తెలిపారు. 

 


మహారాష్ట్ర సరిహద్దు జిల్లా అయిన ఆదిలాబాద్‌లోని 8 మండలంలోని 42 గ్రామాల్లో మిడుతలు వచ్చే ప్రమాదం ఉందని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు జూన్ 20 నుంచి జూలై 7 వరకు మిడతల దండు వచ్చే ప్రమాదముందని నిపుణులు సూచించిన నేప‌థ్యంలో రసాయన మందులు రక్షణ కిట్లు ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మిడ‌త‌ల దండు విష‌యంలో  ప్రజలు భయపడాల్సిన పనిలేదని క‌లెక్ట‌ర్ భ‌రోసా ఇచ్చారు. మిడుతలు కనబడితే తమకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 18004251939 సమాచారం ఇవ్వాలని కోరారు.

 

ఇదిలాఉండ‌గా, ప్ర‌స్తుతానికి తెలంగాణకు మిడతల దండు ప్రమాదం తెలంగాణకు తాత్కాలికంగా తప్పినట్టు కనిపిస్తున్నది. ఐదురోజుల క్రితం మహారాష్ట్రలోని రాంటెక్‌ వద్ద తిష్టవేసిన మిడతల దండు అక్కడి నుంచి గోండియా జిల్లాకు వెళ్లినట్టు గుర్తించారు. గ‌త‌ శనివారం గోండియా జిల్లాలోని పూజరిటోల మండలం కాస గ్రామంలో ఇది కేంద్రీకృతమై ఉంది. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌ వైపు కదిలింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు తాత్కాలికంగా ముప్పు తప్పినట్టేనని అధికారులు భావిస్తున్నారు. నైరుతి రుతుపవనాల ఆగమనం కూడా రాష్ర్టానికి మిడతల ముప్పు తప్పడంలో కొంత వరకు మేలు చేసినట్టు తెలుస్తున్నది. గాలివాటంతో ప్రయాణించే మిడతల దండు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో సరిహద్దు జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగానే ఉన్నది. రైతులకు అపారనష్టం కలిగించే మిడతల దండును అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టిసారించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు తెలంగాణ జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, అగ్నిమాపకశాఖల అధికారులను అప్రమత్తంచేశారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక అధికారుల బృందాన్ని కూడా ఏర్పాటుచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: