ఏపీ సీఎం జగన్ ముందు నేడు పోలవరం రూపంలో అతి పెద్ద సవాల్ కనిపిస్తోంది. కేంద్రం సహాయంతో ఎలాగైనా 2022 నాటికైనా పోలవరం పూర్తి చేయాలని భావిస్తున్న జగన్ కు ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం సహకరిస్తుందన్న అంచనాలు రోజురోజుకూ తలకిందలవుతున్నాయి.  పోలవరం ప్రాజెక్టు చరిత్ర చూస్తే.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఈ ప్రాజెక్టు శంకుస్థాపనలకే పరిమితం అయింది. వైఎస్ జలయజ్ఞంలో భాగంగా పోలవరానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.  ఆయన ఆకస్మిక మరణంతో పోలవరానికి తొలి బ్రేక్ పడింది. వైఎస్ బతికి ఉంటే.. పోలవరం బహుశా 2014 కల్లాకాని , లేక 2016 నాటికి కాని పూర్తి అయి ఉండేదేమో అని ఆయన అభిమానులు అంటుంటారు.

2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం నిర్మించాల్సిన బాధ్యతను తమకు అప్పగించాలని కోరారు. ఇదిగో..అదిగో 2018కే పూర్తి చేస్తామంటూ చెప్పిన చంద్రబాబు సర్కారు.. 2019 వరకూ అధికారంలో ఉన్నా పూర్తి చేయలేకపోయారు.. సరికదా.. నిర్వాసితులు, పునరావాసం సంగతి అలాగే వదిలేశారు. ప్రాజెక్టు పనులు కూడా సగం వరకూ మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పుడు జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక కొంతకాలం రివర్స్ టెండరింగ్ వ్యవహారం నడిచింది.

ఇప్పుడు అనూహ్యంగా కేంద్రం మొండి చేయి చూపుతోంది. అసలు కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును రాష్ట్రం చేతుల్లో పెట్టేసి.. నామ్‌ కే వాస్తేగా నిధులిస్తామంటోంది. గతంలో ఇస్తామన్న వాటిలోనూ కోతలు పెడుతోంది. తాజా లెక్కల ప్రకారం చూస్తే.. ఏకంగా 30 వేల కోట్ల రూపాయల వరకూ ఎగ్గొట్టే ఆలోచనలో ప్రస్తుతం కేంద్రం ఉన్నట్టు కనిపిస్తోంది.

మరి మొదటి నుంచి కేంద్రంతో మెత్తగా ఉంటూ వస్తున్నజగన్ ఈ పోలవరం విషయంలోనైనా కాస్త గట్టిగా నిలదీస్తారా లేదా.. ప్రత్యేక హోదా విషయం తరహాలో మన చేతుల్లో ఏముందని మిన్నకుంటారా అన్నది ముందు ముందు తేలుతుంది. ఏదేమైనా కేంద్రం మరోసారి ఏపీని నట్టేట ముంచేలా కనిపిస్తోంది. జగన్ సర్కారు దూకుడు పెంచకపోతే.. పోలవరం మరింత ఆలస్యం కాక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: