తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తుండ‌టం విశేషం. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని అభ్య‌ర్థులు త‌ల‌ప‌డుతున్నారు. ముఖ్యంగా న‌ల్గొండ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వర్గం నుంచి కోద‌డ‌రాం లాంటి సీనియ‌ర్ తెలంగాణ ఉద్య‌మ‌కారుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ, అనురాగ్‌ విద్యా సంస్థ‌ల చైర్మ‌న్ ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి త‌ల‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ పోటీపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. పోటాపోటీగా అభ్య‌ర్థులు ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.  ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల్లో మొత్తం 70మంది అభ్య‌ర్థులు పోటీ చేస్తుండ‌టం విశేషం. ఏ ఎన్నిక‌ల్లో కూడా ఈ స్థాయిలో పోటీప‌డిన దాఖ‌లాలు మచ్చుకు కూడా లేరు.


 ప్ర‌ధానంగా టీఆర్ ఎస్, వామ‌పక్షాల అభ్య‌ర్థి,  బీజేపీ, టీజేఎస్‌, కాంగ్రెస్‌, యువ‌తెలంగాణ‌, తీన్మార్ మ‌ల్ల‌న్న స్వ‌తంత్ర అభ్య‌ర్థి మ‌ధ్యే పోటీ జ‌ర‌గ‌నుంది.ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి ప్ర‌ధానంగా వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ ఉమ్మ‌డి జిల్లాలు వ‌స్తాయి. ఈ జిల్లాల ప‌రిధిలో  మొత్తం 4,91,396 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,23,377 మంది, మహిళలు 1,67,947 మంది, థర్డ్ జెండర్ కేటగిరీలో 72 మంది ఉన్నారు. అయితే ఈఎన్నికలో భారీగా ఓట్లు చీలే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అంతిమంగా అధికార పార్టీ అభ్య‌ర్థికి ప్ల‌స్ అవుతుంద‌న్న విశ్లేష‌ణ జ‌రుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం మొత్తం కూడా ఉద్యోగాల భ‌ర్తీ విష‌యం చుట్టూతే తిరుగుతుండ‌టం గ‌మ‌నార్హం.


 ఈ విష‌యంపై ఇటీవల స్వ‌యంగా మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.లేఖలో మంత్రి కేటీఆర్ ఈ విధంగా పేర్కొన్నారు. నిజం చెప్పులేసుకునే లోపు అబద్దం ఊరంతా తిరిగొస్తుందన్న మాట ఇవాళ తెలంగాణలోని ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. తమకు అలవాటైన అర్థసత్యాలు, అసత్యాలతో ప్రజలను ముఖ్యంగా యువతను గందరగోళపరచడానికి ప్రతిపక్షాలు మరో కొత్త నాటకాన్ని మొదలుపెట్టాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన ఉద్యోగాల భర్తీ విషయంలో నిజాలను దాచి కాంగ్రెస్, బీజేపీలు చెబుతున్న అబ‌ద్ద‌పు మాటలు అందులో భాగమే అంటూ విమ‌ర్శించారు. అయితే  కేటీఆర్ విడుద‌ల చేసిన లెక్క‌ల్లో త‌ప్పులున్నాయంటూ విప‌క్షాలు విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: