మున్సిపల్ ఎన్నికలను అధికార వైసీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎలా అయినా మెజార్టీ మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలో ఉండేలాగా ఆ పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు నామినేషన్లు దాఖలు చేసేందుకు వైసీపీ పన్నిన కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే రాయదుర్గం మున్సిపాలిటీ లో 23వ వార్డులో టీడీపీ తరఫున ఎర్రమ్మ అలాగే వైసీపీ తరఫున పద్మజ అనే ఇద్దరు బరిలో ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం వైసిపి అభ్యర్థి భర్త ఒక అనుకోని కేసులో చిక్కుకున్నారు. 

అయితే అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే తన భర్తను కేసు నుంచి తప్పించకపోవడంతో పద్మజ అధికార పార్టీ మీద అలిగింది. చాలా రోజుల నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెతో ఇక లాభం లేదని భావించిన వైసీపీ నేతలు ఆ వార్డు నుంచి వైసీపీ తరఫున మరో నామినేషన్ వేయించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ లెక్క ప్రకారం ఇప్పుడు నామినేషన్ వేయడానికి అవకాశం లేదు.

కానీ బెదిరించి భయపెట్టి తమను అప్పట్లో నామినేషన్లు వేయకుండా చేశారని చెబుతూ ఫిర్యాదు చేస్తే అప్పుడు అలాంటి  వారికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు రఘురాం అనే వ్యక్తి భార్యతో ఇప్పుడు నామినేషన్ వేయించేందుకు వైసీపీ నేతలు కుట్రపన్నారు.. అదేమంటే గతంలో నామినేషన్ వేస్తున్న సమయంలో తమ ద్విచక్ర వాహనంలో వెళుతుండగా తమ అడ్డుకున్నారని భయపెట్టి వెనక్కి పంపించారు కాబట్టి ఇప్పుడు నామినేషన్ వేసే అవకాశం ఇవ్వాలని వారు ఫిర్యాదు చేశారు.

ఏకంగా ఎన్నికల సంఘానికి, కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ అభ్యర్థుల మీద దౌర్జన్యానికి పాల్పడటంతో అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు తేల్చాలని ఎన్నికల సంఘం తో పాటు కలెక్టర్ కూడా స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక పోలీసులు అలాంటిదేమీ జరగలేదని తెలుసుకుని ఇది తప్పుడు ఫిర్యాదు అని తేల్చారు. సంఘటనకు సంబంధించి అప్పట్లో ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని ఇప్పుడు కావాలనే నామినేషన్ వేసేందుకు గాను ఇలా తప్పుడు ఫిర్యాదు సృష్టించారని పోలీసులు తేల్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: