పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌‌‌‌కు నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తి భావోద్వేగానికి గురయిన విషయం తెలిసిందే. తాజాగా, మోదీపై గులాం నబీ ఆజాద్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని హోదాలో ఉన్నప్పటికీ మోదీ తన మూలాలను మరిచిపోలేదని, ఇది చాలా గొప్ప విషయమని అభినందించారు.

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని అయ్యాక కూడా ఆయన తన మూలాలను ఎప్పుడూ మరచిపోలేదని అన్నారు. అలాంటి గొప్ప నేతలను చూస్తే గర్వంగా ఉంటుదని ఆజాద్ తెలిపారు. మనం ఎంత స్థాయికి ఎదిగినా.. మన గతాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదని చెప్పారు. ఆదివారం జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆజాద్.. ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎంతో మంది నేతల్లో నాకు అనేక విషయాలు నచ్చుతాయి. నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి జాతీయ స్థాయి నేతగా ఎదిగినందుకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ వంటి నేతలను చూసినప్పుడు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు. చిన్నతనంలో టీ అమ్మేవారు. మేం రాజకీయంగా ప్రత్యర్థులం కావచ్చు. కానీ నరేంద్ర మోదీ ఎప్పుడూ తన మూలాలను మరచిపోలేదు. ఈ విషయంలో ఆయన్ను అభినందిస్తున్నా.


నేను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు తిరిగాను. 5స్టార్, 7 స్టార్ హోటల్స్‌లో ఉన్నాను. కానీ మా గ్రామంలోని ప్రజలతో కూర్చున్నప్పుడు వచ్చే పరిమళాలు ఎంతో ప్రత్యేకమైనవి.అని గులాం నబీ ఆజాద్ అన్నారు.  కొన్ని రోజుల క్రితం రాజ్యసభలో గులాం నబీ ఆజాద్‌ను ప్రధాని మోదీ ప్రశంసల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే.సుదీర్ఘకాల రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆజాద్ దేశానికీ అందించిన సేవలను కొనియాడారు. ఆయన భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఒక ఎంపీగా, ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా ఆయన ఇతర సభ్యులు, భవిష్యత్తు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: