ఒకప్పుడు అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. బలమైన నేతగా పేరున్న వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా జిల్లలోటీడీపీ హవా కనిపించేది. కానీ జగన్ మాత్రం 14 నియోజవర్గాలలో 12 కైవసం చేసుకున్నారు. ఆ దెబ్బకి చాలా మంది టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారు. దీంతో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ గట్టి పోరాటం చేస్తోంది. జిల్లా లోని అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపింది. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు 6 డివిజన్లలో అభ్యర్థులే దొరకలేదు. దీంతో మొత్తం 44 వార్డులకే ఆ పార్టీ పరిమితమైంది. 

ఇక బీజేపీ 15, సీపీఐ 3, సీపీఎం 4, జనసేన 14, కాంగ్రెస్ 11 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అధికార వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్నారు విశ్లేషకులు. అందుకే మేయర్ ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. ఈ సారి కూడా మేయర్ పదవి జనరల్ కి కేటాయించడంతో ఆ పదవి కోసం పోటీ విపరీతంగా ఉంది. వైసీపీ నుండి ప్రధానంగా చవ్వా రాజశేఖర్ రెడ్డి, కోగటం విజయభాస్కర్ రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్,వైవి మణికంఠ రెడ్డి మధ్యే పోటీ నెలకొంది.

మరో పక్క టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీ ఏమో అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. జేసీ పవన్ కుమార్ రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఎవరికీ వారు వర్గాలను మెయింటైన్ చేస్తున్నారు. వీరితో పాటు ప్రకాష్ నాయుడు తమ్ముడు పరిమి రాజారావు మూడో వర్గం అయ్యారు. ఈ ముగ్గురు నాయకుల కుమ్ములాట వైసీపీకి కలిసొచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్లతో పాటు మేయర్ పీఠం మీద ఎలా అయినా వైసీపీ జెండా ఎగురవేసేందుకు అధికార పార్టీ నేతలు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: