కడపలో జరిగిన బాంబు పేలుడు అంశానికి సంబంధించి టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు కూడా ఉన్నారు అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు చేసారు. కడపలో జరిగిన క్వారీ పేలుళ్ల ఘటనలో ప్రభుత్వం అసలు దోషులను వదిలేయాలని చూస్తోందా? అని ఆయన నిలదీశారు. క్వారీ అసలు లీజుదారుగా వైసీపీ ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య సతీమణి కస్తూరిభాయి పేరు ఉంది అని ఆయన తెలిపారు.

2001 నుంచి 2022 వరకు లీజు పరిమితి ఆమె పేరుతోనే ఉంది అన్నారు. నాగేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిపై అనేక కేసులున్నాయి. గతంలో పీడీయాక్ట్ పై అతను జైలుకెళ్లొచ్చాడు అని మీడియాకు వివరించారు. అతనికి క్వారీని సబ్ లీజుకిచ్చామని , తమకు సంబంధంలేదని అసలు లీజు దారులు చెబితే, వారి మాట ప్రకారం అధికారులు నడుచుకుంటారా?  అని నిలదీశారు. అసలు నాగేశ్వర్ రెడ్డికి క్వారీని సబ్ లీజుకిచ్చారా లేక ఇచ్చినట్లు పత్రాలు సృష్టించారా? అని ఆయన ప్రశ్నించారు.

ఎటువంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ ఫీజు చెల్లించకుండా క్వారీ నుంచి రూ.100 కోట్ల విలువైన మెటీరియల్ తరలించారు అని విమర్శలు చేసారు. రామచంద్రయ్య కుటుంబ సభ్యుల జోలికి వెళ్లవద్దని అధికారులకు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా?  అని ప్రశ్నించారు. కడప క్వారీ పేలుళ్ల ఘటనకు ముమ్మాటికీ సీ.రామ చంద్రయ్య, ఆయన సతీమణే కారణం అని మండిపడ్డారు. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే, టీడీపీ తరుపున న్యాయస్థానంలో ప్రైవేట్ కేసు వేస్తాం అని ప్రకటించారు. ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన మాదిరే, కడపలో జరిగిన క్వారీ పేలుళ్లలో, రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయినవారికి కూడా రూ.కోటి పరిహారం ఇప్పించాలి అని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: