మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఉన్నత చదువులు చదివానని చెప్పుకునే కేటీఆర్‌.. నీ సంస్కారం ఇదేనా అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫుల్ ఫైర్ అయ్యారు.  ఇంతకూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అంత కోపం ఎందుకు వచ్చింది.. అసలు ఏం జరిగింది.. చూద్దాం..

గల్వాన్‌ లోయలో తెలుగు బిడ్డ కల్నల్ సంతోష్ వీరోచితంగా పోరాడి అమరుడై ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా సూర్యాపేట‌లో ప్రభుత్వం కల్నల్ సంతోష్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి అదే ప్రాంతానికి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించలేదట. ప్రభుత్వ కార్యక్రమానికి తనను ఎందుకు పిలవ‌లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నిస్తున్నారు.

ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన పార్లమెంటు పరిధిలో జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎంపీని పిలువకపోవడం ఏంటని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రశ్నించారు. ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధైర్యం లేకనే ప్రతిప‌క్ష పార్టీకి చెందిన త‌న‌ను పిలువ‌లేద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇది టీఆర్ఎస్ పార్టీ పిరికిపంద చ‌ర్యగా ఆయన అభివ‌ర్ణించారు.

విపక్ష నేతలను పిలిస్తే.. ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎక్కడ ప్రశ్నిస్తారోనని ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులను కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఉన్నత చదువులు చదివిన‌ట్లు గొప్పలు చెప్పుకునే కేటీఆర్ ఒక్కసారి భారత రాజ్యాంగాన్ని కూడా చదివితే బాగుండునని కోమటిరెడ్డి సూచించారు.  ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల‌కు ప్రజాప్రతినిధుల‌కు త‌ప్పనిస‌రిగా ఆహ్వానించాలని రాజ్యాంగంలో ఉందన్నారు కోమటిరెడ్డి.

తెలంగాణలో గ‌డీల పాల‌న సాగిస్తున్న కేసీఆర్ రాజ్యాంగానికి విలువ ఇవ్వడం లేద‌ని కోమటిరెడ్డి  దుయ్యబ‌ట్టారు. డబ్బు అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలని...ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్ వ్యవహార శైలిని మార్చుకోవాలని సూచించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: