హన్మకొండ నడిగడ్డలో భూ కబ్జాలు పెచ్చుమీరుతున్నాయి. ఏకంగా ఆలయ భూమినే ఆక్రమించారు కబ్జాకోరులు. హన్మకొండ నడిగడ్డలోని హనుమాన్ నగర్ డబ్బాల ప్రాంతంలో వందేళ్ల చరిత్ర ఉన్న దాసాంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి సామాజిక సేవకురాలు, దివంగత పసుపులేటి రాజమల్లమ్మ రెండెకరాల భూమిని ఆలయానికి విరాళంగా ఇచ్చారు. ఆమె 1969లో మృతి చెందింది. ఆమెకు వారసులు కూడా లేరు. ఇక రాజమల్లమ్మ ఇచ్చిన భూమి విలువ కోట్ల రూపాయలకు చేరింది. దీంతో దాసాంజనేయ స్వామి ఆలయ భూములపై ఇప్పుడు కబ్జాసురుల కన్ను పడింది. ఆ భూమిని సొంతం చేసుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆ భూమి తమదంటూ కొందరు కొత్త నాటకానికి తెర తీశారు. దీంతో ఇప్పుడు హన్మకొండలో ఆలయ భూములు చర్చనీయాంశంగా మారాయి.

దాసాంజనేయ స్వామికి పుసులేటి రాజమల్లమ్మ ఇచ్చిన రెండెకరాల భూమి సర్వే నెంబరు 61లో ఉంది. ఆ భూమి తమదంటూ.. ఇప్పుడు కొందరు పత్రాలను తెచ్చి చూపుతున్నారు. ఆలయ భూముల్లో నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇది తెలుసుకున్న స్థానికులు ఆలయ భూముల్లో నిర్మాణాలను అడ్డుకున్నారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ వివాదం నడుస్తుండగానే... అక్రమ నిర్మాణాలపై పోరాటం చేసిన ఈ ప్రాంత కార్పొరేటర్ అనిశెట్టి మురళీ 2017లో దారుణహత్యకు గురయ్యాడు. మురళీ ఇంట్లోకి దూసుకెళ్లిన రౌడీ మూకలు... అతడిని దారుణంగా హత మార్చాయి. అయితే ఈ ఆలయ భూముల వివాదమే మురళి హత్యకు కారణమని అప్పట్లో జోరుగా చర్చ సాగింది. అయితే మళ్లీ ఇప్పుడు కొందరు వ్యక్తులు ఆ భూమి తమదేనంటూ భవన నిర్మాణాలకు పూనుకోవడంతో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

అయితే ఆలయ భూముల కబ్జాలపై స్థానికులే పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఆలయ భూములను కాపాడాలని స్వయంగా దీక్షలకు దిగారు. కానీ ఏ రాజకీయ పార్టీ నాయకులు ప్రజలకు మద్దతు తెలపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వందల కోట్ల విలువైన ఈ భూకబ్జా వ్యవహారంలో అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఆలయాల పరిరక్షణ కోసం ధర్మపోరాటం చేస్తున్నామని చెబుతున్న బీజేపీ, భజరంగ్ దళ్ నాయకులు కూడా దీనిపై స్పందించకపోవడంతో ప్రజల్లో ఇప్పటికే ఉన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: