కరోనా వైరస్ కొత్త వేరియంట్ భారతదేశాన్ని వణికిస్తోంది. నిన్నటి వరకు మనకు ఎలాంటి ప్రమాదం లేదని ధీమా వ్యక్తం చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ... తాజాగా చేసిన ప్రకటన ఇప్పుడు కలకలం రేపుతోంది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో కొవిడ్ కేర్ సెంటర్‌లో క్వారంటైన్‌లో ఉన్న వారిలో ఇద్దరికీ ఓమిక్రాన్ వైరస్ వేరియంట్ సోకినట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా భారత్‌లో కలకలం రేగింది. ఈ ఇద్దరిలో ఒకరు దక్షిణాఫ్రికా జాతీయుడు కాగా... మరొకరు మాత్రం... బెంగళూరు నగరానికి చెందిన వ్యక్తిగానే అధికారులు గుర్తించారు. ఇప్పుడు ఇదే విషయం అందరినీ భయపెడుతోంది. శాండిల్ సిటీకి చెందిన వ్యక్తి నుంచి మరో ఐదుగురికి కూడా వైరస్ వ్యాపించినట్లు ఇప్పుడు పుకార్లు షికారు చేస్తున్నాయి. బెంగళూరు వాసి నుంచి మరో ఐదుగురు ప్రాథమిక కాంటాక్ట్‌లకు కూడా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఐదుగురు కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలారు. దీంతో వీరికి కూడా ఓమిక్రాన్ వేరియంట్ సోకి ఉంటుందని అంతా భావిస్తున్నారు.

ఓమిక్రాన్ వైరస్ వేరియంట్.. గతంలో వచ్చిన కొవిడ్ వేరియంట్ల కంటే కూడా వేగంగా వ్యాపిస్తుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కూడా చేసింది. ఈ సమయంలో బెంగళూరులో రెండు ఓమిక్రాన్ కేసులు నమోదు కావడం... మరో ఐదుగురు ప్రాథమిక కాంటాక్ట్‌లకు కూడా వైరస్ పాజిటివ్ రావడంతో బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఓమిక్రాన్ వైరస్ రోగులను ఒంటరిగా ఉంచినట్లు ఇప్పటికే కర్ణాటక వైద్యాధికారులు వెల్లడించారు. ఇక వారి శాంపిల్స్‌ను ఇప్పటికే జన్యు పరీక్షల కోసం పంపినట్లు కూడా అధికారులు తెలిపారు. ఓమిక్రాన్ సోకిన వ్యక్తి వయసు 46 ఏళ్లు అని, అతను ఇప్పటికే రెండు డోసుల టీకాలు కూడా తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు. జ్వరం, ఒళ్లు నొప్పులతో ఆసుపత్రిలో చేరారని... ఆ మరుసటి రోజే వైరస్ పాజిటివ్ అని తేలినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు అతనికి 13 డైరెక్ట్ కాంటాక్ట్‌లు, 250 కంటే ఎక్కువ సెంకడ్ కాంటాక్ట్‌లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: