తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ? ఎవరికీ అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద తెలంగాణలో ఓ ప్రధాన సామాజిక‌ వర్గం అలకబూనిందా ? తెలంగాణ రాజకీయాలలో ఎప్పుడు పై చేయి సాధించే ఆ సామాజిక వర్గం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమను పట్టించుకోవడంలేదని గుస్సా అవుతోందా ? అంటే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తున్న వారు అవును అనే ఆన్సర్లే ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ అని ఒక ముద్ర ఉంది. రాజకీయ వర్గాలలో కూడా ఇది ఎక్కువగా వినిపించే అభిప్రాయం. లెక్కల ప్రకారం చూసుకున్న రెడ్డి వర్గం ఓటు బ్యాంకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకే అండగా ఉంటూ వస్తుంది. పార్టీలో కూడా రెడ్డి నాయకులదే చేయిగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా... రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో అయినా కూడా కాంగ్రెస్ లో రెడ్డి వ‌ర్గం డామినేష‌న్‌ ఎక్కువగా ఉంటుంది.

ఈ క్రమంలోనే 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రెడ్డి వర్గానికి చెందిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఆ వర్గానికి చెందిన నాయకులకు కీలక పదవులు కట్టబెట్టారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణ‌న చేసిన తర్వాత సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా ఇవ్వాలని పార్టీ అధిష్టానం డిసైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఏకంగా నాలుగు నుంచి ఐదుగురు సీనియర్ రెడ్డి నేతలు మంత్రి పదవులు ఆశించారు. వారిలో ఎవ్వ‌రికి మంత్రి పదవులు రాలేదు. మాల - మాదిగ - బీసీ వ‌ర్గాల‌కు పెద్దపీట వేసింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో రెడ్లకు చోటు లేకపోవడంతో ఆ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

రోజురోజుకు ఈ అసంతృప్తి పెరుగుతున్న క్రమంలో పార్టీలో కొత్త వాదన వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాతే విస్తరణలు రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీ జరిగింది. అక్కడ ఉపాధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులలో కూడా ఏకంగా 68% బీసీ, ఎస్సీ, మైనార్టీలకు కేటాయించారు. సామాజిక న్యాయం చేయాలన్న ఆలోచన మంచిదే అయిన పార్టీకి ఆర్థికంగా వెన్నుముకగా ఉండే సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం మంచిది కాదని రెడ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలంగాణ రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వారే అన్ని విధాల ఆదుకున్నారని ... మొన్న ఎన్నికలకు ముందు వారందరూ ఒకే తాటిమీదకు వచ్చి పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకువస్తే .. ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేకుండా చేయటం సమంజసం కాదన్న అభిప్రాయాలు ఆ వర్గం నేతలలో వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: