ఏపీలో మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది. ఇక ముఖ్యమైన ఘట్టానికి స్థానిక నాయకులు సిద్ధం అవుతున్నారు. పోల్ మేనేజ్ మెంట్ ద్వారా తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఎంత ప్రచారం చేసినా.. నగదు పంపిణీలో వెనుకపడితే అంతే సంగతులు. అయితే పాతికేళ్లలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా ఈ ఎన్నికలు సాగుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


అంత సులభంగా ఎవరికీ విజయం దక్కదని పేర్కొంటున్నారు. అయితే ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో అందరి చూపు ముందు పిఠాపురం పైనే ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్.. ఈ సారి ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. ఎలాగైనా అసెంబ్లీ గేటు తాకాలని చూస్తున్నారు. అయితే ఇంతకన్నా సీరియస్ గా వైసీపీ తన ఎఫర్ట్ ని పెట్టింది. పవన్ ను మరోసారి మట్టి కరిపించి ఆయనకు చెక్ పెట్టాలని చూస్తోంది.


ఇక మంగళగిరిలోను ఇదే పరిస్థితి. విపక్ష నేత కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి విజయం సాధించాలనే పట్టుదలతో ఆయన కేవలం తన నియోజకవర్గానికే మాత్రం పరిమితమై ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మంగళగిరిలో నారా లోకేశ్ ను ఓడించి ఆయనకు అంత టాలెంట్ లేదని చెప్పాలని వైసీపీ భావిస్తోంది.


ఇక మూడో స్థానం కుప్పం. చంద్రబాబు కు కంచుకోటగా ఉన్న కుప్పంలో మెజార్టీ తగ్గించి చంద్రబాబుపై పైచేయి సాధించాలని సీఎం జగన్ చూస్తున్నారు. 2019 నుంచి కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు కి షాక్ ఇచ్చారు. మరోసారి అలాంటి షాకే ఇద్దామని తహతహలాడుతున్నారు. ఈ మూడు స్థానాల్లో గెలుపు కోసం వైసీపీ, కూటమి నేతలు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడటం లేదు. ఇక్కడ కనీసం ఓటుకు రూ.4 వేల వరకు ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. మరికొన్ని చోట్ల ఇంకా ఎక్కువగా ముట్ట జెబుతున్నారని విశ్వసనీయ సమాచారం. మొత్తం మీద ఏపీలో ఈ మూడు నియోజకవర్గ ప్రజలకు ఓట్లకు నోట్ల వర్షం కురుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: