మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను మహారాష్ట్రలో పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసే అధికారం రాష్ట్ర పోలీసులకు ఉంటుందా లేదా అనే విషయంపై తీవ్ర జరుగుతోంది. అదే సమయంలో బీజేపీనుంచి మాటల యుద్ధం మొదలైంది. స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని రియాక్ట్ అయ్యారు. అటు మహారాష్ట్ర బీజేపీ నేతలు సైతం ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. శివసేన ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.

మోదీ నోరు మెదపరా..?
సాక్షాత్తూ తన కేబినెట్ లో ఓ మంత్రిని పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నట్టు..? పోనీ మోదీ మాట్లాడలేదు, కనీసం అమిత్ షా అయినా స్పందించాలి కదా. ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమీక్షకు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాస్త ఆలస్యంగా వచ్చారని, అలా వచ్చి ఇలా వెళ్లిపోయారంటూ అప్పట్లో బీజేపీ నేతలు తెగ హడావిడి చేశారు. ప్రధానికి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ అమిత్ షా కూడా స్పందించారు. అలాంటిది.. ఇప్పుడు ఏకంగా ఓ కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తే అసలెందుకు స్పందించలేదు అనేది ఆశ్చర్యంగా మారింది.

శివసేనతో బీజేపీ పొత్తు కోరుకుంటుందనే విషయం వాస్తవం. ఇటీవల దీనికి సంబంధించి మోదీ, ఉద్ధవ్ ఠాక్రే మధ్య చర్చలు కూడా జరిగాయి. అయితే అవన్నీ కేవలం వ్యక్తిగతం అని సీఎం ఉద్ధవ్ కొట్టిపారేసినా, మహారాష్ట్ర ప్రభుత్వంలో లుకలుకలు మొదలవుతాయని, శివసేన, బీజేపీ కలసిపోతాయని అనుకున్నారంతా. ఈ దశలో కేంద్ర మంత్రి, మహా రాష్ట్ర సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, వెంటనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయించడం, ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదల కావడం చకచకా జరిగిపోయాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రధాని నోరు మెదపకపోవడమే ఇప్పుడు ప్రశ్నార్థకం. మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా ఇటీవలే ఏరి కోరి తన కేబినెట్ లోకి తీసుకున్న నారాయణ్ రాణేను పోలీసులు అరెస్ట్ చేయడంపై మోదీ మౌనం దేనికి సంకేతం అని ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ దీన్ని ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: