వైసీపీలో చాలా మంది నాయ‌కులు ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌ను త‌ప్పిస్తే.. 150 మంది ఎమ్మె ల్యేలు ఉన్నారు. కానీ, ఒక్క‌రు కూడా దివంగ‌త గౌతంరెడ్డి మాదిరిగా ఎందుకు కాలేక పోతున్నారు?  ఆయ‌న కూడా వైసీపీ నాయకుడే. ఆయ‌న‌కు కూడా జ‌గ‌నే అధినేత‌. కానీ, ఎందుక‌ని ఆయ‌నలా వ్య‌వ‌హ‌రించ‌లే క‌పోయారు?  అనేది మేధావుల ప్ర‌శ్న‌. నేడు వైసీపీకి క‌ర‌డుగ‌ట్టిన వ్య‌తిరేక మీడియాలోనూ గౌతంరెడ్డి గురించి చెప్పుకొనేందుకు.. క‌నీసం త‌లుచుకునేందుకు ఒక్క‌టంటే ఒక్క బ్యాడ్ కూడా లేదు. రాజ‌కీయాల్లో ఆయ‌నో అజాత శత్రువు. ఏపీలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య ఇంత రాజ‌కీయ విమ‌ర్శ‌ల వేడి ఉన్నా కూడా ఎప్పుడు ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌లు గౌతంరెడ్డిని చిన్న విమ‌ర్శ కూడా చేయ‌లేదు. అది వ్య‌క్తిత్వం అంటే..!

మ‌రి ఇత‌ర నేత‌ల ప‌రిస్థితి ఏంటి? అనేది ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల్లో తొంద‌ర ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. సంచ‌ల‌నాల‌కు వేదిక‌లు కావాల‌నే త‌ప‌న క‌నిపిస్తోంది. ఏదో ఒక‌టి చేయాలి.. ఏదో ఒక‌టి మాట్లాడేయాలి.. అనే ఆవేశ‌మే త‌ప్ప‌.. ఆలోచించి అడుగులు వేయ‌డం అనేది లేదు. నిజానికి 2019 ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన ఒక కీల‌క విష‌యాన్ని మేక‌పాటి కుటుంబం బ‌య‌ట‌కు చెప్పింది. అప్ప‌ట్లో మంత్రి ప‌ద‌వులు ఇచ్చే ముందు జ‌గ‌న్‌.. మేక‌పాటి పేరును ముందుగా ఎంపిక చేసుకున్నారు.

అయితే.. త‌న‌క‌న్నా సీనియ‌ర్లు ఉన్నార‌ని.. త‌న‌కు అప్పుడే ఎందుక‌ని.. మేక‌పాటి అన్న‌ట్టుగా .. ఆయ‌న కుటుంబంలోని వారు తాజాగా వెల్ల‌డించారు. నెల్లూరు జిల్లాలో మూడు, నాలుగు సార్లు గెలిచిన నేత‌లు కూడా మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్నారు. వీరిలో రెడ్డి నేత‌ల‌తో పాటు ఎస్సీ వ‌ర్గం వారు కూడా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ..జ‌గ‌న్ ఆయ‌న‌లోని కార్య‌ద‌క్ష‌త‌ను(అప్ప‌టికే ప‌లు కంపెనీల‌కు డైరెక్ట‌ర్‌) గుర్తించి.. మంత్రి ప‌ద‌వికి ఎంపిక చేశారు. అంతేకాదు.. జ‌గ‌న్ ఒకానొక ద‌శ‌లో.. మేక‌పాటిని బ‌లవంతం చేసిన‌ట్టు తెలిసింది.

కానీ, నేడు ఉన్న ఎమ్మెల్యేల్లో ఎంద‌రు ఇలాంటి వారు ఉన్నారు?  ఎప్పుడు ప‌ద‌వి వ‌స్తుందా? అని ఎదురు చూస్తున్నారే త‌ప్ప‌.. త‌మ‌లో ఉన్న సామ‌ర్ధ్యాన్ని పెంచుకునేందుకు.. త‌మ సామ‌ర్థ్యం చూసి.. అధినేతే.. నేరుగా వ‌చ్చి ప‌ద‌వి ఇచ్చేలా ఎందుకు చేసుకోలేక పోతున్నారు. అనేది కీల‌క ప్ర‌శ్న‌. కులాలు, వ‌ర్గాలు, ప్రాంతాల‌ను చూసి ప‌ద‌వులు ఇవ్వాల‌ని కోరుకునేవారికి .. మేక‌పాటి ఒక గొప్ప ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు మేధావులు.

మరింత సమాచారం తెలుసుకోండి: