హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే అన్నట్టుంది. టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో సీఎం కేసీఆర్ తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అయినా, ఆయన సతీమణిని పోటీలో దింపినా టీఆర్ఎస్ తో టఫ్ పైట్ మాత్రం గ్యారెంటీ. అధికార టీఆర్ఎస్ ఆ స్థానం కోసం సర్వ శక్తులు ఒడ్డుతోంది. రాగా పోగా కాంగ్రెస్ మాత్రమే ఆటలో అరటిపండులా మిగిలిపోతోంది. గతంలో హుజూరాబాద్ లో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు అనివార్యంగా మూడో స్థానానికి పడిపోవడం మినహా చేయగలిగిందేమీ లేదు. లోకల్ గా.. తీన్మార్ మల్లన్నలాంటి పవర్ ఫుల్ క్యాండిడేట్ ఎవరైనా ఇండిపెండెంట్ గానో లేక, తెలంగాణ జనసమితి తరపునో పోటీకి దిగితే, కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.

తెలంగాణలో జరిగిన, జరుగుతున్న ఉప ఎన్నికలన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. తొలిసారిగా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ చేజార్చుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభ స్థానం కోరుకుంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఎన్నికలు జరిగాయి. ఆ స్థానం టీఆర్ఎస్ వశమైంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల విషయానికొచ్చే సరికి రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. 2018లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ అక్కడ విజేతగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి దారుణ పరాభవం ఎదురైంది. ఇటీవల నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు తగ్గిపోగా, బీజేపీకి బలం స్వల్పంగా పెరిగింది. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ రెండో స్థానం నుంచి దిగజారక తప్పదు. అదే సమయంలో బీజేపీ బలం మరింత పెరుగుతుంది, అదృష్టం కలిసొస్తే ఈటల గెలిస్తే, బీజేపీకి మరో అసెంబ్లీ సీటు పెరుగుతుంది.

ఈటల కాంగ్రెస్ లో చేరతారనుకున్న సమయంలో స్థానిక నాయకుడు కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ దశలో ఆయన మరోసారి కాంగ్రెస్ తరపున ఈటలకు బలమైన ప్రత్యర్థిగా మారతారనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి జరిపిన చర్చలు హుజూరాబాద్ లో కలకలం రేపాయి. కౌశిక్ చూపు టీఆర్ఎస్ వైపు ఉందని గుసగసలు వినిపించాయి. ఈ దశలో కాంగ్రెస్ అభ్యర్థికోసం వెదుక్కునే పరిస్థితి ఉందేమోననే అనుమానాలు కూడా మొదలయ్యాయి. అసలే తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. టీపీసీసీ పీఠం కోసం అందరూ పోటీ పడుతున్నారు. ఈ దశలో ఆ నాయకులంతా హుజూరాబాద్ కోసం చేయి చేయి కలుపుతారనుకోవడం కష్టమే. పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యేనని తేలిన తర్వాత, కాంగ్రెస్ ఇంకా ఉత్సాహం చూపిస్తుందని అనుకోలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: