ఎన్డీఏ తరపున ప్రధాని నరేంద్ర మోడీ.. కూటమి తరపున కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. ప్రచారం మొదలుపెట్టడంతో బీహార్‌ ఎన్నికల్లో అసలు మజా మొదలైంది. నితీష్‌ పాలన అద్భుతమంటూ మోడీ ప్రశంసలు కురిపించగా.. ఎక్కడకు వెళ్లినా ప్రధాని అబద్ధాలే చెబుతారంటూ రాహుల్‌ ఎద్దేవా చేశారు.

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌కు ఇంకా ఐదు రోజులే ఉంది. దీంతో ప్రచార జోరును పెంచాయి పార్టీలు. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోడీ.. సీఎంగా నితీశ్‌ కుమార్ తీసుకున్న చర్యలను ప్రశంసించారు. నితీష్‌ వల్లే బిహార్.. కొవిడ్‌పై పోరాడి ఇప్పుడు ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటోందన్నారు మోడీ. అంతకు ముందు ఆర్జేడీ పాలనలో రాష్ట్రం అవినీతి, నేరాలకు నిలయంగా ఉండేదని విమర్శించారు.

మహాఘట్ బంధన్ నుంచి ప్రచారబరిలోకి దిగిన రాహుల్ గాంధీ.. ఆర్జేడీ యువ నేత తేజస్వియాదవ్‌తో కలిసి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంపైనా, ప్రధాని మోడీపైనా విరుచుకుపడ్డారు. భారత భూభాగంలోకి చైనా దళాలు చొచ్చుకురాలేదని ప్రధాని మోడీ.. జాతికి అబద్ధాలు చెప్పారని రాహుల్ మండిపడ్డారు. గతంలో బిహారీలకు రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారని.. ఇప్పుడు మళ్లీ అలాంటి అబద్ధాలే చెబుతున్నారని దుయ్యబట్టారు.

కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో ఇంటికే పరిమితమైన సీఎం నితీశ్.. ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం బయటికి వచ్చారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. 15 ఏళ్ల పాలనలో నితీశ్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, నవంబర్‌ 3 నుంచి మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు జరగనుండగా.. పదో తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.

మొత్తానికి బీహార్ లో రాజకీయ వేడి రాజుకుంది. ఇటు ప్రధాని మోడీ.. అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇరువురూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఒక పార్టీపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఉండటంతో అక్కడి రాజకీయా యమా రంజుగా మారాయి. కేవలం ఎన్నికలకు ఐదు రోజులే ఉండటంతో వీలైనంత వరకు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. తమ మాటలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.  






మరింత సమాచారం తెలుసుకోండి: