రాష్ట్రంలో చిత్రమైన రాజకీయం సాగుతోంది. కాదంటే అవును అనిలే అన్న తీరున వ్యవహరం సాగుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీగా ఏపీ రాజకీయం మారిపోయాక ఇద్దరు వ్యక్తుల మధ్యన  ప్రతీ విషయం ప్రతిష్టాత్మకంగా మారాక ఇలాగే జరుగుతుంది అనుకోవాలి. దీనికి అచ్చమైన ఉదాహరణ స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ ఎన్నికల విషయంలో ఇపుడు వైసీపీ ఒకలా, టీడీపీ మరోలా ఆలోచన చేస్తోంది. ఇపుడు జగన్ కాదంటున్నాడు కాబట్టి టీడీపీకి అర్జంటుగా ఎన్నికలు కావాలి. ఎన్నికలు పెడితే గెలిచేస్తామని ధీమా ఎక్కువ అయిందా అంటే అది కాదు, జగన్ మొండివాడు. ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉండగా ఎన్నికలకు సిధ్ధపడడు అన్న లాజిక్ ని ఆధారంగా చేసుకుని మాత్రమే టీడీపీ తెగేదాకా లాగుతోంది అంటున్నారు.

కానీ ఇది రాజకీయం. జగన్ కనుక ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని ఎన్నికలకు సై అంటే మాత్రం టీడీపీ చిత్తు కాక తప్పదని అంటున్నారు. ఎందుకంటే ఏపీలో రాజకీయం చూసుకుంటే వైసీపీదే పై చేయిగా ఉంది. ఆయన కరోనా వేళ అని చూడకుండా అనేక సంక్షేమ  కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వరసపెట్టి జనాల్లో తిరుగుతున్నారు. అదే సమయంలో చూసుకుంటే టీడీపీ అధినాయకుడు చంద్రబాబు హైదరాబాద్ కే గత ఆరేడు నెలలుగా పరిమితం అయ్యారు. ఇపుడు వరదలు, వానలు  అంటూ ఆయన కుమారుడు లోకేష్ ఇపుడిపుడే ప్రజలలోకి  వస్తున్నా అది పెద్ద ఇంపాక్ట్ ని కలిగించడంలేదు.

ఇక అచ్చెన్నాయుడుని  బీసీగా గుర్తించి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చామని తెలుగుదేశం చెప్పుకున్నా అది వర్కౌట్ అయ్యేది కాదు. అచ్చెన్న ఏమీ కొత్తగా వచ్చిన నాయకుడు  కాదు, ఇక టీడీపీ ఇంతకు ముందు ఏపీ అధ్యక్షుడిగా చేసిన కళా వెంకటరావు కూడా బీసీనే. దాంతో బీసీ కార్డు ఏమీ ఉపయోగపడదు, అదే సమయంలో బీసీలకు  పెద్ద ఎత్తున  పదవులు వడ్డించిన జగన్ ఎటూ ముందు వరసలో ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే అధికారం చేతిలో ఉంది. మరో మూడున్నరేళ్ళు జగన్ సీఎం గా ఉంటారు. ప్రజలు కూడా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే ఓటు వేయడం సహజ పరిణామం. మరి ఇవన్నీ తెలిసి కూడా ఓటమి భయంతో వైసీపీ ఎన్నికలను వద్దు అంటోందని టీడీపీ రెచ్చగొట్టడం ఎందుకు. ఇది కచ్చితంగా సేఫ్ గేమ్ అని టీడీపీ అనుకోవచ్చు కానీ ఇది రాజకీయం. జగన్ ఎస్ మేము ఎన్నికలకు  రెడీ అంటే మాత్రం టీడీపీకి మరో పరాభవం ఖాయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: