క‌ర్నూలు రాజ‌కీయాల్లో ఆలూరు, ప‌త్తికొండ‌, డోన్ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప‌ట్టు సాధించాల‌నే ఏకైక ల‌క్ష్యంతో ముందుకు సాగిన కుటుంబం కేఈ ఫ్యామిలీ. సీనియ‌ర్ నాయ‌కుడు కేఈ కృష్ణ‌మూర్తితో ప్రారంభ‌మైన ఈ కుటుంబం రాజ‌కీయాలు.. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో కేఈకి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం వర‌కు సాగింది. అంతేకాదు, కేఈ ప్ర‌భాక‌ర్‌, కేఈ ప్ర‌తాప్‌..లు కూడా రాజ‌కీయాల‌లోకి వ‌చ్చారు. వీరిలో మిగిలిన‌వారి ప‌క్క‌న పెడితే.. కేఈ ప్ర‌భాక‌ర్ రాజ‌కీయం మాత్రం ఆస‌క్తిగా మారింది. గ‌త ఏడాది అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేసిన ప్ర‌భాక‌ర్‌.. చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

బాబుసార‌థ్యంలో పార్టీ ప‌త‌న‌మే త‌ప్ప‌.. బాగుప‌డేది లేద‌ని అన్నారు. అంతేకాదు.. పార్టీకి ద‌శ దిశ కూడా లేకుండా పోయాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆయ‌న మ‌ళ్లీ పార్టీలోకి వ‌చ్చారు. వాస్త‌వానికి కేఈల కుటుంబానికి పార్టీ ఎక్కువ‌గానే చేసింద‌ని అంటారు ప‌రిశీల‌కులు.  డోన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు గెలిచిన కేఈ ప్ర‌భాక‌ర్‌.. చంద్ర‌బాబు కేబినెట్లో మంత్రిగా కూడా ప‌నిచేశారు. అయితే.. 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. అటు కేఈ కృష్ణ‌మూర్తికి డిప్యూటీ సీఎం ప‌ద‌వితోపాటు.. ఇటు ప్ర‌భాక‌ర్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విని కూడా ఇచ్చారు.  

ఇదిలావుంటే, రాజ‌కీయాల్లో ఆది నుంచి కోట్ల కుటుంబంతో ఉన్న వైరం నేప‌థ్యంలో ఆ కుటుంబాన్ని టీడీపీలోకి ఆహ్వానించ‌డాన్ని స‌హించ‌లేక పోయిన .. ప్ర‌భాక‌ర్‌. పార్టీకి దూర‌మ‌వుతూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే త‌న అస‌హనాన్ని వ్య‌క్త ప‌రిచేవారు. ఇక‌, గ‌త ఏడాది మొద‌ట్లో .. స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో తాను సూచించిన వారికి అవ‌కాశం ద‌క్క‌క పోవ‌డంతో అలిగిన ప్ర‌భాక‌ర్‌.. ఏకంగా పార్టీపై రాళ్లేసి ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు.

ఈ క్ర‌మంలోనే అటు వైసీపీలోకి, లేదా ఇటు బీజేపీలోకి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. అప్ప‌టి నుంచి మౌనంగా ఉంటున్నారు. తాజాగా మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. ప్ర‌భాకర్ తిరిగి తాను యాక్టివ్ అవుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు పిలుపు మేర‌కు తాను తిరిగి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మ‌రి ఇప్పుడు ఎలాంటి రాజ‌కీయాల‌తో ముందుకు సాగుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: