మోడీ ఒక విషయంలో టాప్ అని విపక్షాలు తెగ మోసేస్తున్నాయి. మోడీ అంటే అంతెత్తున కస్సుమని లేచే విపక్షాలు ఆయనకు కితాబు ఇవ్వడమే ఆశ్చర్యకరం. ఇంతకీ మోడీని పొగుడుతున్నారా లేక సెటైరికల్ గా కామెంట్స్ చేస్తున్నారా అన్నదే ఇక్కడ చర్చ.

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు దాటింది. మరో రెండున్నరేళ్లలో ఆయన పదేళ్ళ పాటు సుదీర్ఘంగా పాలించిన తొలి కాంగ్రేసేతర ప్రధానిగా రికార్డు సాధిస్తారు. మూడవసారి కూడా వరసగా 2024లో గెలిచి ప్రధాని అయితే నెహ్రూ రికార్డుని రీచ్ అవుతారు. ఇందిరాగాంధీ రికార్డులను  దాటి ముందుకు వెళ్తారు. ఇవన్నీ మోడీ విజయాల విషయంలో బెంచ్ మార్కులు అయితే మోడీ పాలనాపరంగా చూసుకుంటే ఏం చేశారు అని విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి.

ప్రభుత్వ రంగ పరిశ్రమలను క్లోజ్ చేయడంలో మోడీ గ్రేట్ అని విపక్షాలు అంటున్నాయి.  అలా ఈ మధ్య కాంగ్రెస్  సహా విపక్షాలు అయితే కొత్త ప్రచారం మోడీకి వ్యతిరేకంగా మొదలుపెట్టాయి.  అదేంటి అంటే దేశానికి తొలి ప్రధానిగా పనిచేసిన పండిట్ నెహ్రూ తన హయాంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ పరిశ్రమలను స్థాపించారని ఆ తరువాత వచ్చిన ఇందిరా గాంధీ సహా అనేక మంది ప్రధానులు ప్రభుత్వ రంగ పరిశ్రమలను పెంచుకుంటూ పోయారని, అయితే మోడీ మాత్రం మొత్తానికి మొత్తం ప్రభుత్వ రంగం అనేది లేకుండా చేస్తున్నారు అని టార్గెట్ చేస్తున్నారు.

ఈ విధంగా కాంగ్రెస్ ప్రచారం చేయడం వెనక రాజకీయ వ్యూహం ఉంది. తాము అధికారంలో ఉంటే ప్రభుత్వ రంగం సురక్షితంగా ఉంటుంది అని చెప్పడమే ఆ వ్యూహం. అయితే కాంగ్రెస్ హయాంలోనే పెట్టుబడుల ఉప సంహరణ అన్నది పురుడు పోసుకుందని బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. తాము చేస్తే అది పుణ్యం, ఇతరులు చేస్తే పాపం అన్నట్లుగా ప్రచారం చేయడం కాంగ్రెస్ కే చెల్లింది అంటోంది. ఇక కాలమానాల ప్రకారం నిర్ణయాలు కూడా మారుతూంటాయని కూడా బీజేపీ నేతల వాదనగా ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ప్రభుత్వ రంగం అవసరం ఉంది. ఇపుడు ప్రైవేట్ కూడా పోటీగా ముందుకు వస్తోంది. దాంతో వారితో ధీటుగా నిలిచి ప్రభుత్వం వ్యాపారం చేయదు అన్నదే మోడీ మార్క్ పాలసీ అంటున్నారు. ఏది ఏమైనా మోడీ పాలనలో అన్నీ క్లోజ్ అంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న ప్రచారం ఎంత మేరకు జనాల్లోకి వెళ్తుంది, దాని ఫలితాలు ఏంటి అన్నది వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: