వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించేందుకు కేవలం రెండే కారణాలు. ఒకటి జగన్ చెప్పిన ఒక్క అవకాశం... మరోటి మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిన నవరత్నాలు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంటూ ప్రకటించారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తా అంటూ ప్రకటించిన జగన్... అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలను అమలు చేశారు. అలాగే ప్రతి ఏటా పథకాల అమలుకు సంబంధించిన క్యాలెండర్ కూడా విడుదల చేస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ... పథకాల అమలులో ఏ మాత్రం వెనుకడుగు వేయటం లేదు.

ఇప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయువు పట్టును జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. రెండు రోజుల క్రితం రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌తో మొదలైన మాటల యుద్ధం... ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ప్రభుత్వం తీసుకురానున్న ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తప్పుబట్టిన పవన్ కల్యాణ్... అదే వేదికపై మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా ప్రస్తావించారు. అసలు కోడి కత్తి కేసు ఏమైందంటూ ప్రశ్నించారు కూడా. వీటితో ఆగకుండా... ఇప్పుడు తాజాగా... ప్రభుత్వ పథకాలను టార్గెట్ చేశారు జనసేనాని. నవరత్నాల వల్ల.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందంటూ లేఖ రాశారు. అసలు మద్య నిషేధం ఏమైందంటూ ప్రశ్నించారు. మద్యం వచ్చే ఆదాయాన్ని గ్యారంటీగా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్నారని కూడా లేఖలో ప్రస్తావించారు. కరెంట్ ఛార్జీలపై కూడా ఇచ్చిన హామీని పక్కన పెట్టేశారని పవన్ ఆరోపించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.


మరింత సమాచారం తెలుసుకోండి: