ఆగస్టు 15న విజయవాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభమైన ఉచిత బస్సు పథకానికి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తయ్యాయి. ఈ ఒక నెలలోనే ఈ పథకం మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా మహిళలకు ఇది పెద్ద బహుమతిగా మారింది. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైనదే ఈ ఉచిత బస్సు. మాట ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే కసరత్తులు చేసి ఆగస్టు 15న పథకాన్ని అమలు చేశారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల రాష్ట్రంలోని మహిళలు అక్షరాలా ఊపిరి పీల్చుకున్నట్లు మారింది. ముఖ్యంగా ఉద్యోగినులు, విద్యార్థినులు, శ్రామిక మహిళలు ఈ పథకం ద్వారా ఊహించని లాభం పొందుతున్నారు.


అక్షరాలా 118 కోట్ల రూపాయల లాభం!:
నెల రోజుల వ్యవధిలోనే 3.17 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించారు. వీరు దాచుకున్న మొత్తం విలువ 118 కోట్ల రూపాయలు. ఏడాదికి ఇది 1500 కోట్లకు పైగా అవుతుంది. ఇంతటి ఆర్థిక లాభం ప్రతి ఇంటికి చేరడం కూటమి ప్రభుత్వానికి కీర్తిపతాకాన్ని అందించింది. ఇక 100 కిలోమీటర్ల వరకు ఎక్స్‌ప్రెస్ బస్సులలో కూడా ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండటంతో పక్క జిల్లాలకు, స్వగ్రామాలకు, దేవాలయ దర్శనాలకు, విహార యాత్రలకు మహిళలు స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నారు.



మహిళల పర్సుల్లో అదనపు సేవింగ్స్ :
ఇప్పటి వరకు ఉద్యోగినులు నెలకు కనీసం 1500 రూపాయలు బస్ పాస్ కోసం ఖర్చు చేసేవారు. ఇప్పుడు ఆ మొత్తం పర్సుల్లోనే మిగిలిపోతోంది. విద్యార్థినులకు కూడా ఇదే లాభం – మూడు నెలలకు 1500 రూపాయలు వెచ్చించాల్సిన స్టూడెంట్ పాస్ ఖర్చు తగ్గి, నెలకు 500 రూపాయలు దాచుకునే అవకాశం వచ్చింది. రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలు ఆటోలు, క్యాబ్‌లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. రోజుకు వంద రూపాయలు ఆటోకే వెళ్ళిపోవడంతో నెలకు దాదాపు 3000 రూపాయలు పోయేవి. ఇప్పుడు ఆ మొత్తం సేవింగ్ అవుతోంది.



ఆక్యుపెన్సీ రేటు జోరులో :
ఉచిత బస్సు వల్ల ఆర్టీసీ బస్సుల్లో మహిళల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగింది. మొత్తం ప్రయాణికుల్లో 67 శాతం వరకు మహిళలే ఉన్నారని ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి. మధ్యతరగతి గృహిణులు కుటుంబంతో బయటకు వెళ్లేటపుడు నెలకు వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు కనీసం అయిదు వందలు దాచుకోగలుగుతున్నారు. ఫలితంగా నెలలో రెండు మూడు సార్లు సైతం వారు బస్సులో ప్రయాణిస్తున్నారు. ఒక పథకం అంతా మారుస్తుందా అనుకున్నవారికి ఉచిత బస్సు పథకం సమాధానం చెబుతోంది. స్త్రీ శక్తిని ప్రోత్సహించే ఈ నిర్ణయం రాష్ట్ర మహిళలందరికీ నిజమైన గిఫ్ట్‌గా మారింది. వచ్చే రోజుల్లో ఈ పథకం ఇంకా ఎలాంటి శక్తిని, ఏ విధమైన సామాజిక మార్పును తీసుకొస్తుందో చూడాలి కానీ… ఇప్పటివరకూ లెక్కలన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: