అవును మీరు చదివింది నిజ్జంగా నిజమే. కలలో కూడా చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసమే 24 గంటలూ ఆలోచించే, పనిచేసే ఎల్లోమీడియా అధినేత వేమూరి రాధాకృష్ణ తన కొ(చె)త్త పలుకులో చంద్రబాబుకే రివర్సు తిరిగాడు. చంద్రబాబులోని లోపాలను ఏకరువు పెట్టాడు. ఇంతేనా చంద్రబాబులోని లోపాలను ఎత్తి చూపటం ఓ ఎత్తైతే జగన్మోన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు బ్రహ్మాండమంటూ భజన మొదలుపెట్టటం మరో ఎత్తు. తన లోపాలను ఎత్తి చూపినా బహుశా చంద్రబాబు పట్టించుకోకపోవచ్చు కానీ జగన్ ను పొగిడితే తట్టుకోగలడా ? అన్నదే ప్రశ్న.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఈ వారం రాసిన తనపలుకులో చంద్రబాబు రెండోసారి సిఎం అయిన తర్వాత ఐటి రంగాన్ని నెత్తిన పెట్టుకుని మిగిలిన రంగాలను గాలికొదిలేశాడని బల్లగుద్ది మరీ చెప్పాడు. పార్టీలో సీనియర్ నేతలకు కూడా అందుబాటులో లేకుండా పోయినట్లు చెప్పాడు.  జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల చేతిలోనే పెత్తనమంతా పెట్టేసి మంత్రులు, ఎంఎల్ఏలను డమ్మీలను చేసేశాడనే నిజాన్ని ఇంతకాలనికైనా బయటపెట్టాడు. ఆకస్మిక తనిఖీల పేరుతో ఉద్యోగులను దూరం చేసుకున్నాడట. ముఖ్యమంత్రిగా కన్నా ఓ కంపెనీకి సీఈవోగా పిలిపించుకోవటానికే చంద్రబాబు ఇష్టపడే వాడనే నిష్ఠూరాన్ని ఎల్లోమీడియా అంగీకరించింది.

 

చంద్రబాబు విధానాల వల్ల జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో ఎంతమంచి పేరు వచ్చిన 2004లో ఓడిపోయాడని తెగ బాధిపడిపోయింది ఎల్లోమీడియా. జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మంచి పేరొచ్చిందంటే ఆ మీడియాను ప్రలోభాలకు గురిచేసి పాజిటివ్ గా వార్తలు రాయించుకోవటం వల్లే అని ఇప్పటికీ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తునే ఉంటాయి. ఇందులో నిజం కూడా లేకపోలేదు లేండి. ఎందుకంటే చంద్రబాబు సిఎం అయ్యిందో వెన్నుపోటు వల్ల కాబట్టి తనపై ఎక్కడా వ్యతిరేక వార్తలు రాకుండా జాగ్రత్త పడటంలో భాగంగానే అందరినీ మంచి చేసుకున్నాడు.

 

పదేళ్ళ ప్రతిపక్ష వాసం తర్వాత 2014లో మళ్ళీ మూడోసారి సిఎం అయిన చంద్రబాబు బలమైన ప్రతిపక్ష నేత హోదాలో  జగన్మోహన్ రెడ్డి ఉన్నాడన్న విషయాన్ని మరచిపోయాడన్న నిజాన్ని చెప్పింది.  మూడోసారి ముఖ్యమంత్రయిన తర్వాత కూడా చంద్రబాబు పార్టీని, రాజకీయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడనే విషయాన్ని ఇప్పటికైనా బయటపెట్టింది. రెండోసారి సిఎం అయినపుడు మంత్రులు, ఎంఎల్ఏలను డమ్మీ చేశాడనే ఆరోపణలను చెరిపేసుకునేందుకు ప్రయత్నించాడట. అందుకు ఏమి చేశాడయ్యా అంటే మొన్నటి ఐదేళ్ళు పూర్తి స్వేచ్చ ఇచ్చేశాడని ఒప్పుకున్నది.

 

ఐదేళ్ళ పాటు పూర్తి స్వేచ్చ కారణంగానే చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అవినీతి, అరాచకాలకు అడ్డులేకుండా పోయింది. చింతమనేని ప్రభాకర్, కోడెల కుటుంబం, యరపతినేని  లాంటి వాళ్ళ అరాచకాలే ఇందుకు సాక్ష్యాలు. మొదట్లోనే చంద్రబాబు పరిపాలన గాడి తప్పించదని జనాలు అనుకున్నా లెక్క చేయలేదన్నది కూడా కరెక్టే. కేవలం కొద్దిమంది కోసమే చంద్రబాబు పాలన సాగుతోందని జనాలు అనుకున్నారన్న ఎల్లోమీడియా అంగీకరించింది కూడా నూరుపాళ్ళు నిజమే. సరే ఇలాంటి చంద్రబాబు లోపాలను ఎల్లోమీడియా ఇప్పటికైనా బయటపెట్టినందుకు అభినందించాల్సిందే.

 

అయితే ఇక్కడే ఓ డౌట్ వస్తోంది అందరికీ. ఐదేళ్ళ పాటు జనాల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని  చంద్రబాబు కంటికి కనబడకుండా గంతలు కట్టేసింది ఎవరు ? ఇంకెవరు ఎల్లోమీడియానే కదా. చంద్రబాబు పాలనంతా బ్రహ్మాండమంటూ భజన చేసిందెవరు ? ఇంకెవరు ఎల్లోమీడియానే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టిడిపి ఘోర ఓటమిలో ఎల్లోమీడియా పాత్ర ఎంతుందో పార్టీలో ఏ నేతను అడిగినా చెప్పేస్తాడు. అంటే చంద్రబాబు మీద జనాల్లో అసంతృప్తి పెరిగిపోవటానికి తానే ప్రధాన కారణమన్న విషయాన్ని మాత్రం ఎల్లోమీడియా అంగీకరించలేదు. ఇక్కడే రౌతు చేతకాని వాడు కాబట్టే గుర్రం ఎగిరి తన్నిందనే సామెత గుర్తుకు వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: