ఇంటర్‌నెట్ డెస్క్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ శ్రీలంక స్పిన్నర్‌కు పట్టపగలే చుక్కలు చూపించారు. ఈ దెబ్బతో సౌత్‌ఆఫ్రికా బ్యాట్స్‌మన్ హర్షల్ గిబ్స్, టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సాధించిన రికార్డును పొలార్డ్ సమం చేశాడు. ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదేశాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో పొలార్డ్ సిక్సుల వర్షం కురిపించాడు. ఒక ఓవర్‌లో 6 సిక్సులు బాది రికార్డు సృష్టించాడు. పొలార్డ్ బాదుడుకు శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనంజయకు పీడకల మిగిల్చాడు.
           
బుధవారం రాత్రి విండీస్, శ్రీలంక మధ్య తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. శ్రీలంక తరుపున నిరోషన్ డిక్‌వెల్లా(33: 29 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), పథుమ్ నిశాంక (39: 34 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్స్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.

మెకాయ్ ఒక్కడే 2 వికెట్లు తీయగా.. మిగతావారంతా ఒక్కో వికెట్ తీశారు. ఇక ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు లెండిల్ సిమన్స్(26: 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు), ఎవిన్ లూయిస్(28: 10 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సులు) మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే క్రిస్ గేల్, నికోలస్ పూరన్ డకౌట్ అయి నిరాశపరిచారు. అయితే చివర్లో పొలార్డ్(38: 11 బంతుల్లో 6 సిక్సులు) భారీ బాదుడుకు విండీస్ జట్టు ఘన విజయం సాధించింది.

పొలార్డ్ ధాటికి విండీస్ 131 పరుగుల లక్ష్యాన్ని 13.1ఓవర్లలోనే ఛేదించింది. సౌత్ ఆఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హర్షలీ గిబ్స్, భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత ఆరు బంతుల్లో ఆరు సిక్సులు నమోదు చేసిన ఘనత కీరన్ పొలార్డ్‌కే దక్కింది.




మరింత సమాచారం తెలుసుకోండి: