బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై నిన్న రాత్రి ఒక పబ్బులో దాడి జరిగింది. కొందరు యువకులు బీరు సీసాలతో రాహుల్ పై, అతని స్నేహితులపై దాడి చేశారు. ఈ దాడిలో రాహుల్ తీవ్ర గాయాలపాలయ్యాడు. గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రాహుల్ చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాహుల్ అతని స్నేహితులు, స్నేహితురాలు నిన్న రాత్రి 11.30 గంటలకు గచ్చిబౌలిలోని ఒక పబ్ కు వెళ్లారు. 
 
రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. రాహుల్ యువకులతో మర్యాదగా ప్రవర్తించమని చెప్పగా ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. కొంత సమయం తరువాత ఇరువర్గాలు పరస్పరం దాడికి దిగాయి. యువకులు రాహుల్ పై, అతని స్నేహితులపై బీరు సీసాలతో దాడి చేశారు. రాహుల్ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. రాహుల్ తో గొడవ పడిన వ్యక్తులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులని తెలుస్తోంది. 
 
ఎమ్మెల్యే బంధువులు యువతిపై అసభ్యకర కామెంట్లు చేయడంతో రాహుల్ వారితో దురుసుగా ప్రవర్తించాడని సమాచారం. దీంతో వారు రాహుల్ పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రాహుల్ తప్పే ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాహుల్ క్షేమంగానే ఉన్నారు. రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 
 
బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ షో నుండి బయటకు రాగానే సెలబ్రిటీగా బిజీ అయిపోయాడు. షోలు, లైవ్ కసర్ట్స్, పాటలు అంటూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న రంగ మార్తాండ సినిమాతో రాహుల్ నటుడిగా వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. రాహుల్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగానే ఫ్లాట్, మెర్సిడెజ్ బెంజ్ కారు కొనడంతో పాటు లగ్జరీ హెయిర్ సెలూన్ ను ఓపెన్ చేశాడు. రాహుల్ పై దాడి జరిగినట్లు తెలియడంతో ఆయన అభిమానులు కంగారు పడుతూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: