హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో తెరంగేట్రం చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ప్రముఖ నటుడు మురళీమోహన్ నిర్మాతగా కూడా వ్యవహరించిన 25 చిత్రాలను నిర్మించారు. కానీ ఒక్క సినిమా కారణం గా ఆయన సంపాదించిన ఆస్తులన్నీ పోయాయట. దీంతో ఇక చిత్ర నిర్మాణ రంగానికి దూరంగా ఉండాలని మురళీమోహన్ నిశ్చయించుకున్నారు. అందుకే గత 16 ఏళ్లలో జయభేరి ఆర్ట్స్ పతాకంపై ఒక్క సినిమాను కూడా నిర్మించలేదు. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై చివరిగా మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమా వచ్చింది. కానీ అది కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించదగ్గ స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయిందని మురళీమోహన్ చెబుతుంటారు. బుల్లి తెరపై మాత్రం అతడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పవచ్చు.

మురళీమోహన్ నిర్మించిన సినిమాల్లో కొన్ని ఫ్లాపులు ఉన్నాయి, కొన్ని విజయాలు ఉన్నాయి. ఇది చిత్ర పరిశ్రమలో సర్వ సాధారణమే అయినప్పటికీ మురళీమోహన్ మాత్రం సినిమాలు అస్సలు చేయను అని మొండికేసి కూర్చున్నారు. ఎందుకని అడిగితే.. ఇప్పటి రోజుల్లో ఓ సినిమా విజయవంతం అయితే ప్రతి ఒక్కరూ కలిసి ఉంటారు కానీ ఎప్పుడైతే సినిమా ఫెయిల్ అయిందో అప్పుడు ఎవరు కూడా పట్టించుకోకుండా నష్టాలనన్నీ కూడా నిర్మాత నెత్తి మీద రుద్దుతారు. అలాగే ఒక స్టార్ హీరో సినిమా చేయాలంటే డేట్స్ కోసం ఆయన చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి ఉంటుంది. సినిమా పూర్తయ్యేంతవరకు ప్రతిరోజు హీరో చుట్టూ తిరుగుతూ ఆయన అడిగిందల్లా ఇవ్వాల్సి ఉంటుంది. 80 ఏళ్ళ వయసులో ఆ పనులు చేతకాకనే తాను సినిమాలను నిర్మించడం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఈ కారణాలతో పాటు గతంలో ఒక సినిమా భారీ డిజాస్టర్ కావడమే తనని నిర్మాణ రంగం నుంచి పూర్తిగా దూరం చేసిందని చెబుతారు మురళీమోహన్.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇద్దరు' సినిమా తన ఆస్తినంతా తడిచిపెట్టేసిందని మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పట్లో కరుణానిధి ప్రతిపక్షంలో ఉన్నారని, జయలలిత అధికారంలో ఉన్నారని.. అందుకే తమిళనాడు రాజకీయాల గురించి ఉన్నది ఉన్నట్లు 'ఇద్దరు' సినిమాలోని సన్నివేశాలు రూపొందించారని మురళీ అన్నారు. కానీ సినిమా విడుదలయ్యే సమయానికి కరుణానిధి అధికారంలోకి వచ్చారని.. ఆయన ఈ సినిమాను చూసి తనకు నచ్చని సన్నివేశాలను ఎడిట్ చేయించారని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. అయితే కీలకమైన సన్నివేశాలు కట్ చేయడం తో ఈ సినిమా యొక్క కంటిన్యూటి దెబ్బతిన్నదని.. దీంతో ఆయన భారీ రేట్ పెట్టి కొనుగోలు చేసిన ఇద్దరు సినిమా డిజాస్టర్ గా నిలిచిందని ఆయన అన్నారు. దీంతో తాను సంపాదించిన ఆస్తి అంతా కూడా "ఇద్దరు" సినిమాతో పోయిందని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: