రానురాను ఎన్నిక‌లు చాలా కాస్ట్లీగా మారుతున్నాయి. మొన్న‌జ‌రిగిన హుజురాబాద్ ఎల‌క్ష‌న్స్‌లో 6వేల నుంచి 10 వేల రూపాయ‌ల వ‌ర‌కు పంచారు. ఇప్పుడు త‌మ టైమ్ వ‌చ్చింద‌ని, ఎంపీటీసీలుగా గెలిచిన త‌రువాత నుంచి పైసా ప‌ని చేయ‌లేద‌ని.. చేయ‌నివ్వ‌లేద‌ని, ప‌ని కోసం వెళ్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు త‌మ ద‌గ్గ‌ర క‌మీష‌న్‌లు తీసుకున్నార‌ని చెబుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ‌కు 6 నుంచి 10 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఇవ్వాల్సిందేన‌ని ఎంపీటీసీలు అంటున్నారు.

 
 స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోరు మ‌హా ఖ‌రీదుగా మారిపోయింది.. దీనికి ప్ర‌ధాన కార‌ణం కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక అనే చెప్పొచ్చు. అక్క‌డి పంప‌కాలు, ప్ర‌లోభాల‌తో ఇప్పుడు మండ‌లి స‌భ్యుల ఎన్నిక‌ల్లో ఓట్ల‌కు భారీగా డిమాండ్ పెరిగింది. కొన్ని చోట్ల బ‌హిరంగంగానే అమ్మ‌కానికి పెడుతున్నారు.  దీంతో మండ‌లి ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పోటీ చేయాలంటే భ‌య‌ప‌డే స్థితి వ‌చ్చింద‌నే చెప్పాలి. స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల్లో భాగంగా ప‌రిష‌త్ స‌భ్యుల ప‌ద‌వికాలం ద‌గ్గ‌ర ప‌డింది. మ‌రొక ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం మాత్ర‌మే ఉంది. ఇక ఈ స‌మ‌యంలో ఆర్థిక ఆశ‌లు పెరుగుతున్నాయి.


 దీంతో పార్టీ ఏదైనా పైస‌లు ఇస్తేనే ఓటు వేసేందుకు స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు సిద్ధం అవుతున్నారు. దీనికి తోడుగా ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు తిర‌గ‌బ‌డుతున్న పరిస్థితి కూడా ఏర్ప‌డుతుంది. త‌మ‌కు ప్రాధాన్య‌త లేదంటూ క‌నీసం కూర్చోడానికి కూడా కుర్చీ లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ నేప‌థ్యంలో తామే పోటీ చేస్తామంటూ ప్ర‌క‌టిస్తున్నారు. ఇక దీంతో వారిని ఒప్పించ‌డం కోసం అభ్య‌ర్థులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం త‌క్కువ ఓట్లు ఉన్న‌ప్ప‌టికి ఇవి కాస్ట్లీ ఓట్లుగా మారిపోయాయి. ఎంపీటీసీల‌తో పాటు జెడ్పీటీసీలు కూడా ఆర్థిక అండ కోసం చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.  పార్టీ త‌ర‌ఫున అంతా ఒప్పించినా కూడా డ‌బ్బులు ఇవ్వాల‌ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు డిమాండ్ చేసే అవ‌కాశం ఉంద‌ని పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: