దేశంలో వ్యాక్సిన్ కార్య‌క్ర‌మం 150 కోట్ల మైలురాయిని దాటింది. రెండు డోసుల టీకాల పంపిణీలో ఈ టార్గెట్‌ను చేరింద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్ర‌క‌టించారు. కోల్‌క‌త్తాలోని ఛిత్త‌రంజ‌న్ నేష‌న‌ల్ క్యాన్స‌ర్ ఇనిస్టిట్యూట్ రెండో క్యాంప‌స్‌ను ప్రారంభించిన మోడి మాట్లాడుతూ.. ఈ రోజు భారత‌దేశం మరో చారిత్రక మైలురాయిని అధిగమించింద‌న్న ఆయ‌న‌.. దేశంలో ఇప్పటివరకు 150 కోట్లకు పైగా క‌రోనా టీకా డోసులు పంపిణీ చేశామ‌ని చెప్పారు. 90 శాతానికి పైగా అర్హుల‌యిన ప్రజలు మొద‌టి డోసు అందుకున్నార‌ని, ఇక 15-18 సంవ‌త్స‌రాల‌ వయసున్న‌ వారికి వ్యాక్సినేష‌న్ పంపిణీ ప్ర‌క్రియ వేగంగా కొన‌సాగుతుంద‌ని చెప్పారు. నూత‌న ఏడాది తొలి ఐదు రోజుల్లోనే 1.5 కోట్లకు పైగా టీనేజర్లు మొద‌టి డోసు టీకా తీసుకున్నార‌ని పేర్కొన్నారు.



 అయితే,  కొవిన్‌ గణాంకాల ఆధారంగా.. శుక్రవారం మధ్యాహ్నానికి దేశవ్యాప్తంగా 150.06 కోట్లకు పైగా టీకా డోసుల‌ను అందించారు.  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గతేడాది జనవరి 16 న దేశంలో క‌రోనా టీకా పంపిణీని ప్రారంభించారు. తొలి దశలో ఫ్రంట్‌లైన్ వారియ‌ర్ల జాబితాలో ఉన్న‌ వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య‌ కార్మికులకు.. ఏప్రిల్ 1వ తేది నుంచి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ ప్రారంభించారు. అనంత‌రం మే ఒక‌టి నుంచి 18 సంవ‌త్స‌రాలు నిండిన పౌరులంద‌రికీ టీకా పంపిణీ ప్రారంభించారు. అయితే, ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఏర్ప‌డ్డ‌ప్ప‌టికీ.. రెండో ద‌శ ఉధృతి స‌మ‌యంలో టీకాల పంపిణీ వేగం పెంచుకుంది ఈ క్ర‌మంలో గ‌త సంవ‌త్సంర అక్టోబ‌ర్ 21 తేది నాటికి 100 కోట్ల టీకా పంపిణీ పూర్తి చేసుకుని భార‌త్ రికార్డు సృష్టించింది.


   ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న వేళ కేంద్రం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగం పెంచింది. దీంతో జ‌న‌వ‌రి 3 నుంచి 15-18 ఏళ్ల వ‌య‌స్సున్న వారికి కొవిడ్ టీకాలు ఇస్తోంది. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 10 నుంచి ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌తో పాటు 60ఏళ్లు దాటిన వారికి.. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతున్న బాధితుల‌కు త‌గిన ముందు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచ‌న‌లు జారీ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: