కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ  ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని ఆమె ఆరోపించారు. పోలీసుల కాల్పులకు మరణించిన కొంత మంది ఆందోళనకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తుండగా ఆమెను అడ్డుకుని ఈ విధంగా చేశారని ఆరోపించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు హాజరైన తనపై పోలీసులు మెడ పట్టి పక్కకు తోశారని అన్నారు. 


మాజీ ఐపీఎస్ అధికారి కుటుంబ సభ్యులను కలిసి వస్తున్న సమయంలో తనకు ఈ చేదు అనుభవం ఎదురైందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం పై తాను వస్తుండగా పోలీసులు చేయి చేసుకున్నారని ఆరోపించారు.  సీఏఏ, ఎన్ఆర్‌సీ లపై ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లో ఉద్రిక్తతలు తార స్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆందోళన కారులను బెదరగొట్టే తీరుపై కాంగ్రెస్ కూడా పలు విమర్శలు చేసింది. పోలీసుల కాల్పులకు కొంత మంది ఆందోళనకారులు మరణించారు. వీరి కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక, రాహుల్ కూడా వెళ్లి పరామర్శించారు. 


ఈ నేపథ్యంలో శనివారం ఓ కార్యకర్తను కలిసేందుకు వాళ్ల ఇంటికి వెళ్లి తిరిగి ఓ స్కూటీపై వస్తుండగా పోలీసులు అడ్డగించి మెడపై చేయితో తోసేశారని ప్రియాంక గాంధీ ఆరోపిస్తున్నారు. అయితే, ఆందోళనలు జరుగుతున్నప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


అయితే, భద్రతా సిబ్బంది ఎక్కువ మంది లేనందునే తనపై పోలీసులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని ప్రియాంక ఆరోపించారు. ‘‘మా కార్యకర్తను కలిసి, టూ వీలర్‌ వెనక కూర్చొని వస్తున్నాను. ఈలోపు దారిలో పోలీసుల వాహనం వచ్చింది. మీరు వెళ్లకూడని ఆదేశించారు. నేను ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించాను. నడుచుకుంటూ వెళ్లాలా అని అన్నాను. నాపై దౌర్జన్యం చేసి తోసేశారు.’’ అని ప్రియాంక మీడియాతో మాట్లాడారు

మరింత సమాచారం తెలుసుకోండి: