మళ్లీ పంజా విసిరేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారా? తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. కయ్యానికి సిద్ధం అంటూ 34 మంది మావో అగ్ర నేతల తలలపై రివార్డులు ప్రకటించారు ఛత్తీస్ గడ్ పోలీసులు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులే ఎక్కువగా ఉన్నారు. 

 

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు గుట్టుచప్పుడు కాకుండా పావులు కదుపుతున్నారు. సుక్మా -  బీజాపూర్ సరిహద్దుల్లో ఈ నెల 18 నుండి మూడు రోజుల పాటు జరిగిన భారీ బహిరంగ సభకు సుమారు పదివేల మంది కార్యకర్తలు హాజరైనట్లు సమాచారం. మార్చి నెలలో మావోయిస్టుల దాడిలో చనిపోయిన జవాన్ల ఆయుధాల ప్రదర్శనను ఈ సభలో ఏర్పాటు చేశారు. ఇటీవల మరణించిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి స్థానాన్ని భర్తీ ని ఈ సభలో చర్చించినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అధ్యక్షతన ఈ సభ జరిగింది.

 

దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలతో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.  మావోయిస్టు అగ్రనేత లపై ప్రభుత్వం భారీ రివార్డులను ప్రకటించింది. మొత్తం 34 మంది జాబితాను తయారుచేసి వారి తలపై రివార్డు ప్రకటించింది. ఇందులో ఏపీ తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత లు నంబాల కేశవరావు, మల్లోజుల వేణుగోపాల్, ముప్పాళ్ల లక్ష్మణరావు, కటకం సుదర్శన్ ల పై కోటి రూపాయల రివార్డు ఉంది. ఇక మరో తొమ్మిది మంది పై 40 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. వీరిలో మల్లా రాజిరెడ్డి, ఆర్ కె, చంద్రన్న, బాలన్న, తిప్పర్తి తిరుపతి, గాజర్ల రవి, కడారి సత్యనారాయణలు ఉన్నారు. మరో 17 మందిపై 25 లక్షల రివార్డును చతిస్గడ్ ప్రభుత్వం ప్రకటించింది.

 

తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి, వెంకటాపూర్ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో జనం బహిరంగ సభకు హాజరైన టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పటివరకు దండకారణ్యంలో మావోయిస్టులు 1800 మందిని చంపినట్టు ప్రకటించారు. మావోయిస్టుల ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు ఛత్తీస్ గఢ్ పోలీసులు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం విడుదల చేసిన హిట్ లిస్టులో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకి చెందిన మావోయిస్టు నేతలు ఉన్నారు. 

 

మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను యూనివర్సిటీ   విద్యార్థుల పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటు ఇప్పటికే పలువురు ప్రొఫెసర్ లను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇప్పుడు చత్తీస్ గఢ్ సభకు మావోయిస్టు అనుబంధ సంఘాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరైనట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.  వారిపై ఎస్ ఐ బి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: