టీమిండియా కెప్టెన్‌ కోహ్లీకి.. డాషింగ్‌ ఓపెనర్‌ రోహిత్‌కు మధ్య వివాదం నడుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్‌ కోల్పోవడం అటుంచితే.. కోహ్లి, రోహిత్‌ మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్‌ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి కంటే ఎక్కువగా ఇప్పుడు ఇంకో విషయం గురించే చర్చ జరుగుతోంది. పోయినేడాది టీమిండియా ఇంగ్లండ్‌లో ప్రపంచకప్ టోర్నీలో ఆడిన సమయంలో ఫస్ట్‌ టైం ఇలాంటి వార్తలే వచ్చాయి. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అలాంటి పుకార్లే గుప్పుమంటున్నాయి

బహుశా, సక్సెస్‌ఫుల్‌ కెరీర్ కొనసాగిస్తున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల  మధ్య దూరం పెరగడానికి.. 'ఈగో' ఇష్యూ కారణమై ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ దూరం ఇప్పుడు ఎంతగా పెరిగిందంటే, ఆస్ట్రేలియాతో తొలివన్డేకు ముందు.. ప్రెస్ కాన్ఫరెన్సులో మాట్లాడిన కోహ్లి.. రోహిత్ శర్మ గాయం గురించి చాలా గందరగోళం ఉందనీ.. అతడి గాయం పరిస్థితిపై పూర్తి స్పష్టత లేదనీ చెప్పాడు. మిగతా టీమ్‌తో కలిసి రోహిత్ శర్మ ఆస్ట్రేలియా ఎందుకు రాలేదో కూడా తనకు తెలీదన్నాడు. సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు.. రోహిత్ అందుబాటులో లేడని తనకు ఈ-మెయిల్ వచ్చిందన్నాడు. తమకు  ఇప్పటికీ తన గురించి ఏదైనా స్పష్టమైన సమాచారం అందుతుందనే వెయిట్ చేస్తున్నామనీ.. కోహ్లీ చెప్పాడు.

విరాట్ కోహ్లీ చెబుతున్నది నిజమే కావచ్చు, కానీ.. రోహిత్‌తో కోహ్లీ డైరెక్ట్‌గా మాట్లాడలేనంతగా గొడవ ఏం జరిగి ఉంటుందనేదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ టోర్నీలోనూ.. వీళ్లిద్దరూ పరస్పరం మట్లాడుకునే అవకాశం వచ్చినా పలకరించుకోలేదు. ఇవన్నీ చూస్తుంటే, రోహిత్ శర్మ పాత్రపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే, అతడు తన గాయం గురించి ఇప్పటివరకూ ఓపెన్‌గా మాట్లాడలేదు.

ఇంత జరుగుతుంటే.. బీసీసీఐ ఏం చేస్తోందనే ప్రశ్న తలెత్తక మానదు. ప్రేక్షకపాత్ర పోషిస్తోందనే విమర్శలూ వినిపిస్తున్నాయి.  రోహిత్, కోహ్లీ మధ్య గొడవను సృష్టించినట్టుగా అనిపిస్తోందనే అభిప్రాయమూ వినిపిస్తోంది. అంతేకాదు, కెప్టెన్‌,వైఎస్‌ కెప్టెన్‌ల మధ్య సఖ్యత లేకపోవడం అంత మంచిది కాదనే భావనా వ్యక్తమవుతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఉన్న గోడలను ఎంత త్వరగా పడగొడితే భారత జట్టుకు అంత మంచిదని క్రికెట్‌ లవర్స్‌ సూచిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: