ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కంటే బ్లాక్ ఫంగస్ గురించే వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ అంత ప్రమాదకరంగా మారింది. దేశంలో ఓ వైపు కరోనా విజృంభిస్తోంది. ప్రజలు కరోనాతో పోరాటం చేస్తున్నారు. ఇంతలో మరోవైపు బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తూ ప్రజలను కలవరపెడుతోంది. రోజరోజుకు బ్లాక్ ఫంగస్ మరణాలు పెరగడంతో అందరిలో తీవ్ర భయం రేకేత్తుతోంది. బ్లాక్ ఫంగస్ వ్యాధి భయంతో ప్రధానంగా మధుమేహ వ్యాధిగ్రస్థులు ఆందోళన చెందుతున్నారు. మధుమేహం నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడుతున్న వారిలో టెన్షన్ మొదలైంది. అయితే.. షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకుంటే బ్లాక్ ఫంగస్ గురించి భయపడాల్సిన అవసరమే లేదని వైద్యులు చెబుతున్నారు.

షుగర్ చెక్ చేసుకోవడానికి గ్లూకోమీటర్ ను తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం పరగడుపున షుగర్ చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. అప్పుడు షుగర్‌ లెవెల్‌ 125 కంటే దిగువన ఉండాలి. టిఫిన్‌ చేసిన అనంతరం గంటన్నర తర్వాత మరోసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు షుగర్ లెవెల్ 250 కంటే తక్కువగా ఉండాలంటున్నారు. వీలైతే ఒకసారి ల్యాబ్‌కు వెళ్లి హెచ్‌బీ ఏ1సీ (మూడు నెలల సగటు) చూపించుకోవాలని.. గరిష్టంగా 7.2 కంటే తక్కువగా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెబుతున్నారు.

షుగర్ ను కంట్రోల్ ఉంచుకోవాలంటే ఏం తినాలి..
షుగర్ ను కంట్రోల్ ఉంచుకోవడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుందని, అందుకే షుగర్ తో బాధపడుతున్న వారు పలు ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జొన్న, కొర్రలు, రాగులు, అండుకొర్రలతో చేసిన ఆహారం, బీరకాయ, సోరకాయ, గోరు చిక్కుడు, చిక్కుడు కాయల్లో పీచు ఎక్కువగా ఉంటుందని, వాటిని ఆహారంలో తీసుకోవడం వల్ల షుగర్స్ లెవల్స్ పెరగవని చెబుతున్నారు. వాటితో పాటు పైనాపిల్, నిమ్మ, జామపండ్లు తీసుకోవాలంటున్నారు. వీటిల్లో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. బియ్యంతో చేసిన ఇడ్లీలు, దోశలు, అన్నం, పఫ్‌ లు, బంగాళ దుంప వంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని అంటున్నారు.

ఇన్సులిన్ : –
కరోనా బారిన పడితే స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో షుగర్ ఎక్కవవుతుందని, మందులతో నియంత్రణలోకి రాదని వైద్యులు చెబుతున్నారు. షుగర్‌ నియంత్రణలోకి వచ్చేవరకూ ఇన్సులిన్‌ వాడుకోవచ్చని, నియంత్రణలోకి వచ్చాక ఇన్సులిన్‌ వాడటం ఆపేసి.. తిరిగి మందులు వాడొచ్చని వైద్యులు చెబుతున్నారు. మొత్తానికి బ్లాక్ ఫంగస్ కు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు మరోసారి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: