కరోనా చికిత్సకు ఎన్నో వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో తయారు చేస్తున్న వ్యాక్సిన్ లనే ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. రోజుకో కొత్త ముందుకు అనుమతులు ఇస్తున్నారు. అయినా దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడుతోంది. చాలా రాష్ట్రాల్లో ఇంకా 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ పంపిణీ చేయడం ప్రారంభించలేదు. కొన్ని రాష్ట్రాల్లో 45 ఏళ్ల పైబడిన వారికి.. అది కూడా సెకండ్ డోస్ మాత్రమే వేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కోవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీని నిలిపివేస్తున్నట్టు ఆదివారం సాయంత్రం ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మళ్ళీ కోవాగ్జిన్‌ టీకాల పంపిణీ ఎప్పుడు చేస్తామనేది త్వరలో చెప్తామని పేర్కొంది. దీంతో సోమవారం నుంచి కోవాగ్జిన్‌ టీకా పంపిణీ నిలిచిపోతుంది.

అయితే శని, ఆదివారాల్లో వ్యాక్సిన్ పంపిణీని నిలిపివేస్తున్నామని.. తిరిగి సోమవారం నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం 3 రోజుల క్రితం తెలిపింది. కానీ రాష్ట్రంలో కోవాగ్జిన్‌ స్టాక్ లేదని, కేంద్రం నుంచి కొత్త స్టాకు రాకపోవడంతో వ్యాక్సినేషన్ ను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే కోవిషీల్డ్‌ టీకా వ్యాక్సినేషన్ కి సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కొత్తగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కోవిషీల్డ్‌ రెండో డోసును 84 రోజుల (12 వారాల) తర్వాతే ఇవ్వాలంటూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికి మాత్రం.. 8 నుంచి 12 వారాల మధ్య ఇవ్వొచ్చని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. స్లాట్‌ బుక్‌ చేసుకోని వారికి 84 రోజుల గడువు ముగిశాకే వ్యాక్సిన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు కొత్త గడువు ప్రకారం రెండో డోసు తీసుకోవాలని భావిస్తే.. ఆ మేరకు పోర్టల్‌ లో మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 45 ఏళ్లు పై బడిన వారికి రెండో డోసును మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ముందస్తు రిజిస్ట్రేషన్‌/బుకింగ్‌ అవసరం లేదని, వ్యాక్సిన్ కేంద్రాల్లోనే స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసి వ్యాక్సిన్‌ వేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో పాత గడువుతో రెండో డోసు తీసుకోవాల్సిన వారు దాదాపుగా లేరని అధికారులు చెబుతున్నారు. కొత్త గడువు (84 రోజులు) ప్రకారం మరికొన్ని రోజుల పాటు రెండో డోసు వేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగుతుందా, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది. కొత్తగా తొలి డోసు పంపిణీ ప్రారంభిస్తారా? అనే అంశాలపై క్లారిటీ లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: